సాక్షి, హైదరాబాద్ : ఔషధాల ఉత్పత్తి పరిమాణం రీత్యా, ప్రపంచంలోనే మూడవ అతిపెద్దదిగా ఉన్న భారతీయ ఔషధ పరిశ్రమ, చైనా ముడి పదార్థాలపై ఎక్కువగా ఆధారపడుతుండడాన్ని ప్రస్తుత పరిణామాలు బహిర్గతం చేశాయి. ముడి సరకు సరఫరాలో జాప్యం, ధరల పెంపు కారణంగా భారతీయ ఫార్మా పరిశ్రమ ముడిపదార్థాల సరఫరాలో కొరతను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో ఔషధ భద్రత, ప్రజారోగ్యానికి అత్యవసర మందుల అందుబాటు కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, భారతదేశంలో బల్క్ డ్రగ్ తయారీని ప్రోత్సహించేందుకు తద్వారా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ఒక ప్యాకేజ్‌ని ఆమోదించారు.
పరిశ్రమ వర్గాలు, భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్)కు చెందిన హైదరాబాద్లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్‌కు చెందిన సమీకృత ఔషధ తయారీ కంపెనీ లక్సాయ్ లైఫ్ సైన్సెస్‌తో కలిసి సంయుక్తంగా క్రియాశీల ఔషధ తయారీ పదార్థాలు( యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియెంట్స్), ఇంటర్మీడియేట్‌లను భారతీయ ఔషధ తయారీ పరిశ్రమకోసం ఉత్పత్తి చేస్తాయి. దీనితో చైనా దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. కరోనా వైరస్ వ్యతిరేక పోరాటంలో వాడుతున్న ఔషధాల సంశ్లేషణ కోసం ఐఐసీటీ, లక్సాయ్‌తో కలిసి పనిచేస్తోంది.
ఈ సంస్థలు ప్రధానంగా యుమిఫెనోవిర్, రెమ్‌డెసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ)కీ ఇంటర్మీడియట్పై దృష్టి పెట్టనున్నాయి. మలేరియాపై పోరాటానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాలలో భారత్ ఒకటి. ఇటీవలి కాలంలో దీని డిమాండ్ బాగా పెరిగింది. గత కొద్ది రోజులలో అమెరికాతో సహా 50 దేశాలకు భారతదేశం హైడ్రాక్సి క్లోరోక్విన్ను పంపింది. ఈ కొలాబరేషన్, చైనాపై నామమాత్రంగా ఆధారపడే రీతిలో కీలక ముడి పదార్థాలను చౌకగా తయారు చేసే ప్రక్రియకు దోహదపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment