
పోచారం, ఆదిభట్ల, పోలెపల్లి.. ఈ మూడు నగరానికి ఒక్కో దిక్కునున్న ప్రాంతాలు. కానీ, వీటిని కలిపే కామన్ పాయింట్.. స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)! ఐటీ సెజ్‌తో పోచారం, ఏరోస్పేస్ సెజ్‌తో ఆదిభట్ల ప్రాంతాలు ఎలాగైతే అభివృద్ధి చెందాయో ఇప్పుడు ఫార్మా సెజ్‌తో పోలెపల్లిలో రియల్ జోరందుకుంది. తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయానికి సెజ్ చుట్టూ ఉండే ప్రాంతాలు సరైన వేదికలని పరిశ్రమ వర్గాల సూచన. దీంతో సెజ్‌ల చుట్టూ 10 కి.మీ. పరిధి వరకూ స్థిరాస్తి అభివృద్ధి జోరందుకుంది.
పారిశ్రామిక, ఐటీ సెజ్‌లు స్థిరాస్తి రంగానికి వృద్ధి చోదకాలుగా మారుతున్నాయి. ఎస్‌ఈజెడ్‌ల చుట్టూ 10 కి.మీ పరిధి లోపు భారీ వెంచర్లు, ప్రాజెక్ట్‌లతో రియల్ అభివృద్ధి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలుండే ప్రతి చోటా రియల్ వృద్ధి కచ్చితంగా ఉంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. దీనికితోడు సామాజిక అవసరాలైన విద్యా సంస్థలు, ఆసుపత్రులు, మౌలిక వసతులైన రహదారులు, విద్యుత్, మంచినీళ్ల వంటి ఏర్పాట్లూ ఉంటే సెజ్‌లు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని సూచించారు. పోచారం, ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్ సెజ్‌లే ఇందుకు ఉదాహరణ.
పోలెపల్లి ఫార్మా, పారిశ్రామిక హబ్..
హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారిలో పోలెపల్లి సెజ్ 2,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో హెటిరో, అరబిందో, ఎప్సిలాన్, ఏపీఎల్ హెల్త్‌కేర్, మైలాన్ ల్యాబొరేటరీస్, శిల్పా మెడికేర్, ఆప్టిమస్ జెనిరిక్స్ వంటి బహుళ జాతి ఫార్మా కంపెనీలున్నాయి. సుమారు 65 వేల మంది ఉద్యో గులుంటారని అం చనా. ఈ ప్రాంతంలో ఎన్‌ఎంఐఎంఎస్ యూనివర్సిటీ, ఎల్ అండ్ టీ నైపుణ్య శిక్షణ కేంద్రం, అశోక్ లేల్యాండ్‌లూ ఉన్నాయి. దగ్గర్లోనే ఎన్‌ఆర్‌ఎస్‌సీ, డీఎల్‌ఎఫ్, అమెజాన్, పీ అండ్ జీ, జాన్సన్ అండ్ జాన్సన్‌లు కూడా కొలువుదీరాయి. 10 కి.మీ. దూరంలో బాలానగర్ పారిశ్రామికవాడ ఉండటంతో మొత్తంగా ఈ ప్రాంతమంతా ఫార్మా, పారిశ్రామిక హబ్‌గా అభి వృద్ధి చెందింది. దీంతో ఆయా ప్రాంతంలో స్థలాల ధరలు పెరిగాయి. ‘‘సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ చేతిలో ఉన్న 5–6 లక్షల సొమ్ముతో ముందుగా ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. ఆ తర్వాతే అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల వైపు వెళుతుంటారని’’ క్రెడాయ్ హైదరా బాద్ ప్రెసిడెంట్ ఎస్ రాంరెడ్డి తెలిపారు. పోలెపల్లిలో స్థలాల పెరుగుదలకు కారణమిదే.
ప్లాట్లు, విల్లాల హవా..
బెంగళూరు జాతీయ రహదారిలో ప్రధానంగా రాజాపురం, బాలానగర్, షాద్‌నగర్, పోలెపల్లి ప్రాంతాల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ‘‘రెండేళ్ల క్రితం ఉద్దానపురంలో ఎకరం రూ.3.5 లక్షలకు కొనుగోలు చేశాం. ఇప్పుడక్కడ రూ.20 లక్షలకు పైమాటే. ఇక జాతీయ రహదారి వెంబడైతే ఎకరం కోటికి తక్కువ లేదని’’ స్పేస్ విజన్ సీఎండీ నర్సింహా రెడ్డి తెలిపారు. పోలెపల్లిలో ఐటీ పార్క్ ప్రతిపాదన, డ్రైపోర్ట్ వంటి వాటితో వచ్చే ఏడాది కాలంలో 20–40 శాతం ధరలు పెరగడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ స్థలాల ధరలు గజానికి రూ.4 వేల నుంచి ఉన్నాయి. అపార్ట్‌మెంట్లు చ.అ.కు రూ.2,500 నుంచి చెబుతున్నారు. ఈ ప్రాంతంలో స్పేస్ విజన్, గిరిధారి, దుబాయ్‌కి చెందిన విన్‌సెంట్ నిర్మాణ సంస్థల వెంచర్లు, ప్రాజెక్ట్‌లున్నాయి. విన్‌సెంట్
10 ఎకరాల్లో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.
కొత్త సిటీల అభివృద్ధి..
ఇప్పటికే పోలెపల్లి ఫార్మా సెజ్‌గా అభివృద్ధి చెందింది. దీనికితోడు 10 కి.మీ. దూరంలోని జడ్చర్లలో తెలంగాణ ప్రభుత్వం ఐటీ పార్క్‌ను ప్రతిపాదించింది. మల్టీ లాజిస్టిక్ హబ్ అయిన డ్రై పోర్ట్ కూడా పరిశీలనలో ఉంది. దీంతో పోలెపల్లి నుంచి జడ్చర్ల, బాలానగర్ ప్రాంతాల వరకూ రియల్ వెంచర్లు, ప్రాజెక్ట్‌లు వెలిశాయి. సెజ్ నుంచి నగరానికి మధ్యలో ఉండే ప్రాంతం మరో కొత్త సిటీగా అభివృద్ధి చెందే అవకాశముందని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీవీ రావు చెప్పారు. ఉదాహరణకు ఆదిభట్లలో ఇప్పటికే ఏరోస్పేస్ కంపెనీల కార్యకలాపాలు మొదలయ్యాయి కాబట్టి మరిన్ని ఉద్యోగ అవకాశాలొస్తాయి. దీంతో రోజూ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లొచ్చే బదులు స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. దీంతో ఇన్నాళ్లూ శివారు ప్రాంతం కాస్త కొత్త నగరంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment