హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇళ్ల విక్రయాలు దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో జూలై–సెప్టెంబర్‌లో 88,234 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 41 శాతం ఎక్కువ అని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీ రాజధాని ప్రాంతం, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం, చెన్నై, కోల్‌కత, బెంగళూరు, హైదరాబాద్, పుణే ఈ జాబితాలో ఉన్నాయి. 2021 జూలై–సెప్టెంబర్‌లో ఈ నగరాల్లో 62,799 యూనిట్లు అమ్ముడయ్యాయి.
2022 సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గృహాలు 45 శాతం పెరిగి 93,490 యూనిట్లకు చేరుకుంది. ఇండ్ల అమ్మకాలు ఢిల్లీ రాజధాని ప్రాంతంలో 46 శాతం దూసుకెళ్లి 14,966 యూనిట్లు నమోదైంది. ముంబై 26 శాతం పెరిగి 26,400, బెంగళూరు 48 శాతం వృద్ధితో 12,690, హైదరాబాద్ 73 శాతం అధికమై 11,650, కోల్‌కత 54 శాతం ఎగసి 4,953 యూనిట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రాపర్టీల ధరలు నగరాన్నిబట్టి 1–2 శాతం పెరిగాయి.
ట్రెండ్ కొనసాగుతుంది..
ముడి సరుకు వ్యయం ప్రియం కావడం, కోవిడ్ తదనంతరం డిమాండ్ అధికం కావడంతో వార్షిక ప్రాతిపదికన ధరల పెరుగుదల 4–7 శాతంగా ఉంది. ఏడు నగరాల్లో ఎదురుగాలులు ఉన్నప్పటికీ మూడవ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు, కొత్త లాంచ్‌లు రెండూ ఊపందుకున్నాయని అనరాక్ చైర్మన్ అనుజ్ పురీ తెలిపారు. ప్రధాన కంపెనీల నుంచి కొత్త గృహాల సరఫరా పెరిగిందన్నారు.
కోవిడ్–19 తదనంతరం సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్న తపన కస్టమర్లలో అధికం అయిందని వివరించారు. పండుగల త్రైమాసికంలోనూ ట్రెండ్ కొనసాగుతుందని చెప్పారు. ‘పండుగ సీజన్‌లో విక్రయాల ఊపును కొనసాగించేందుకు డెవలపర్లు లాభదాయక లాంచ్ ఆఫర్లను పరిచయం చేశారు. వీటికి మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంచేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను దూకుడుగా పెంచాల్సి వస్తే మార్కెట్‌లో కొంత గందరగోళం ఏర్పడవచ్చు’ అని ఆయన తెలిపారు.
చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment