మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ వెరిటో | Mahindra goes fully electric with new sedan e-Verito priced at Rs 9.5 lakh | Sakshi
Sakshi News home page

మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ వెరిటో

Published Fri, Jun 3 2016 1:04 AM | Last Updated on Mon, Oct 8 2018 7:58 PM

మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ వెరిటో - Sakshi

మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ వెరిటో

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వెరిటో సెడాన్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఇ-వెరిటో పేరుతో ఈ ఎలక్ట్రిక్ మోడల్‌ను మూడు వేరియంట్ల

ధర రూ.9.5 లక్షలు-10 లక్షల రేంజ్‌లో...
కిలోమీటర్‌కు రూ.1.15 వ్యయం

 న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వెరిటో సెడాన్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఇ-వెరిటో పేరుతో ఈ ఎలక్ట్రిక్ మోడల్‌ను మూడు వేరియంట్ల(డీ2, డీ4, డీ6)లో అందిస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తెలిపింది. ఈ కార్ల ధరలు రూ.9.5 లక్షల నుంచి రూ.10 లక్షల రేంజ్‌లో ఉన్నాయని (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్(ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు.  ఇది తమ  పోర్ట్‌ఫోలియోలో మొదటి ఎలక్ట్రిక్ సెడాన్ అని వివరించారు.  మొదటగా ఈ వాహనాన్ని ఢిల్లీలో,  ఆ తర్వాత హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చంఢీగఢ్, పుణే, జైపూర్, నాగ్‌పూర్‌లలో అందుబాటులోకి తెస్తామని వివరించారు.

 110 కి.మీ. ప్రయాణం...: ఎలక్ట్రిక్ మోటార్, 72ఓల్ట్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తున్న ఈ కారును ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేయడానికి 9 గంటల 45 నిమిషాలు పడుతుందని, 18 యూనిట్ల కరెంట్ అవసరమవుతుందని, ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే,  110 కి.మీ. ప్రయాణిస్తుందని ప్రవీణ్ షా  తెలిపారు. యూనిట్‌కు రూ.7 చొప్పున లెక్కిస్తే, ఒక్కో కిలోమీటర్‌కు వ్యయం రూ.1.15 అవుతుందని వివరించారు. ఈ కారును ఇంటి వద్ద చార్జ్ చేసుకోవచ్చని, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ(హై ఎండ్ మోడల్ డీ6లోనే ఈ ఫీచర్ లభ్యం) ద్వారా గంటా 45 నిమిషాల్లోనే 80 శాతం వరకూ చార్జింగ్ చేసుకోవచ్చని వివరించారు.

తాము ఆప్షనల్‌గా అందిస్తున్న సోలార్ చార్జర్‌ను ఉపయోగిస్తే, ఎలాంటి బాహ్య విద్యుత్ అవసరం లేదని వివరించారు. ఈ కారు  గరిష్ట వేగం గంటకు 86 కిమీ. అని, ఎలాంటి కాలుష్యకారక ఉద్గారాలను వెలువరించదని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని మోడళ్లలో ఎలక్ట్రిక్ వేరియంట్లను అందించనున్నామని షా తెలిపారు. త్వరలో 8 సీట్ల డీజిల్ వ్యాన్ సుప్రోలో ఎలక్ట్రిక్ వేరియంట్‌ను ఇ-సుప్రో పేరుతో అందించనున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement