మహీంద్రా హెలికాప్టర్లు వస్తాయ్..
- ఎయిర్‌బస్‌తో జాయింట్‌వెంచర్
న్యూఢిల్లీ: భారత సాయుధ బలగాలకు అవసరమయ్యే హెలికాప్టర్ల తయారీ కోసం మహీంద్రా గ్రూప్, యూరోపియన్ దిగ్గజం ఎయిర్‌బస్ చేతులు కలిపాయి. ఎయిర్‌బస్ హెలికాప్టర్స్, మహీంద్రా డిఫెన్స్ కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్ సంస్థను నెలకొల్పనున్నాయి. మేకిన్ ఇండియా నినాదం కింద తొలి భారతీయ ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ సంస్థ స్వరూపాన్ని ఖరారు చేసేందుకు త్వరలో చర్చలు జరపనున్నట్లు ఇరు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ వెంచర్‌తో వందల కొద్దీ హై-టెక్ ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉంటుందని, అత్యుత్తమ సాంకేతికతను భారత్‌లోకి తీసుకురావడం సాధ్యపడుతుందని ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ ప్రెసిడెంట్ గిలామ్ ఫౌరీ పేర్కొన్నారు. దేశ రక్షణ అవసరాలను తీర్చడంతో పాటు ఈ హెలికాప్టర్లను ఎగుమతి కూడా చేసే అవకాశాలున్నాయని మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ ప్రతినిధి ఎస్‌పీ శుక్లా చెప్పారు.