30 రకాల పనులకు ఒకే ట్రాక్టర్..
♦ మహీంద్రా నుంచి యువో ట్రాక్టర్లు
♦ రూ.300 కోట్ల వ్యయంతో అభివృద్ధి
♦ జహీరాబాద్ ప్లాంటులో తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అత్యాధునిక టెక్నాలజీతో యువో శ్రేణి ట్రాక్టర్లను మంగళవారమిక్కడ భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దున్నడం మొదలు కోతల వరకు 30కిపైగా రకాల పనులను (అప్లికేషన్లు) ఇది ఇట్టే చేసి పెడుతుంది. అన్ని రకాల నేలల్లో దూసుకుపోగలదు. 32-45 హెచ్‌పీ శ్రేణిలో 5 రకాల ట్రాక్టర్లను కంపెనీ రూపొందించింది. 15 గేర్లు, 1,500 కిలోల బరువును లేపగలిగే సామర్థ్యం, 400 గంటల పని తర్వాతే సర్వీసింగ్, గంటకు 30 కిలోమీటర్ల వరకు వేగం యువో ప్రత్యేకతలు. 12 రాష్ట్రాల్లో 7,000 మందికిపైగా ట్రాక్టర్ల యజమానుల సూచనల సమాహారమే యువో అని ఈ సందర్భంగా మహీంద్రా ఈడీ పవన్ గోయెంకా మీడియాకు తెలిపారు.
రోజుకు 140 ట్రాక్టర్లు: హైదరాబాద్ సమీపంలోని జహీరాబాద్ వద్ద ఉన్న మహీంద్రా ప్లాంటులో యువో ట్రాక్టర్లను తయారు చేస్తున్నారు. ఈ ప్లాంటుకు ప్రస్తుతం రోజుకు 140 ట్రాక్టర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అవసరాన్నిబట్టి సామర్థ్యాన్ని పెంచుతారు. యువో అభివృద్ధికి రూ.300 కోట్లు ఖర్చు చేశారు. చెన్నైలో కంపెనీకి చెందిన ఆర్‌అండ్‌డీ కేంద్రం మహీం ద్రా రీసెర్చ్ వ్యాలీలో వీటికి రూపకల్పన చేశారు. 2014 ఆగస్టులో నోవో ట్రాక్టర్లను ప్రవేశపెట్టిన రెండేళ్లలోపే నూతన శ్రేణిలో మోడళ్లను తీసుకురావడం విశేషం. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో యువో ట్రాక్టర్ల ధర రూ.4.99-6.49 లక్షలు ఉంది. యూఎస్‌తోపాటు ఇతర దేశాలకు వీటిని ఎగుమతి చేయనున్నారు.
పరిశ్రమ 10 శాతం వృద్ధి..
గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలు సుమారు 5 లక్షల ట్రాక్టర్లను విక్రయించాయి. 2016-17లో అమ్మకాల్లో 10 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా. అనుకూల వాతావరణం, వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇందుకు దోహదం చేస్తాయని పవన్ గోయెంకా చెప్పారు.