
ఇక ఇంగ్లండ్ లోనే మాల్యా నివాసం
ఇకపై ఇంగ్లాండ్‌లోనే మాకాం...
న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాలకు సంబంధించి ఉద్దేశపూర్వక ఎగవేతదారు ఆరోపణలు వెంటాడుతున్న నేపథ్యంలో విజయ్ మాల్యా గురువారం యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ‘నాపై వచ్చిన ఆరోపణలకు, డయాజియో.. యునెటైడ్ స్పిరిట్స్‌తో సంబంధాలపై అనిశ్చితికి తెర దించేందుకు సమయం వచ్చింది. దానికి అనుగుణంగానే నేను తక్షణమే రాజీనామా చేస్తున్నాను. ఇక సంతానానికి చేరువగా ఉండేలా మరింత సమయం ఇంగ్లాండులో గడపాలని నిర్ణయించుకున్నాను’ అని మాల్యా ఒక ప్రకటనలో తెలిపారు. మాల్యా కుటుంబం నెలకొల్పిన యునెటైడ్ స్పిరిట్స్‌ను డయాజియో సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. యూబీ గ్రూప్ సంస్థలకు అక్రమంగా నిధులు మళ్లించారన్న ఆరోపణలపై మాల్యాకి, డయాజియోకి మధ్య వివాదం నడుస్తున్న పరిస్థితుల్లో ఆయన నిష్ర్కమణ ప్రాధాన్యం సంతరించుకుంది.
యునెటైడ్ స్పిరిట్స్ గౌరవ వ్యవస్థాపకుడిగా తనకు గుర్తింపునిచ్చేలా డయాజియోతో సానుకూల ఒప్పందం కుదిరినట్లు మాల్యా వివరించారు. సంస్థ నుంచి నిష్ర్కమణకు గాను డయాజియో ఆయనకు దాదాపు రూ. 515 కోట్లు చెల్లించనుంది. ఆయన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా.. యూఎస్‌ఎల్ గ్రూప్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతారు. గ్రూప్‌లో భాగమైన ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చీఫ్ మెంటార్‌గా మాల్యా ఉంటారు. మరోవైపు, యూఎస్‌ఎల్ చైర్మన్‌గా మహేంద్ర కుమార్ శర్మను డయాజియో నియమించనుంది.