దిద్దుబాటు మరికొన్నాళ్లు..! | Markets turn choppy ahead of CPI, IIP data; GAIL down 4% | Sakshi
Sakshi News home page

దిద్దుబాటు మరికొన్నాళ్లు..!

Published Mon, Dec 15 2014 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

దిద్దుబాటు మరికొన్నాళ్లు..!

దిద్దుబాటు మరికొన్నాళ్లు..!

అమ్మకాలు కొనసాగుతాయ్
పారిశ్రామికోత్పత్తి క్షీణత ఎఫెక్ట్
టోకు ధరల గణాంకాలు నేడు వెల్లడి
పార్లమెంట్ సమావేశాలపైనా దృష్టి
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల విశ్లేషణ

 
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో గడిచిన వారం మొదలైన దిద్దుబాటు(కరెక్షన్) ఈ వారం కూడా కొనసాగుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గత వారం చివర్లో వెలువడ్డ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) ఇందుకు కొంతమేర కారణంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ నెలకు ఐఐపీ మైనస్ 4.2%కు పడిపోవడం ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. ఈ బాటలో నవంబర్ నెలకు గత శుక్రవారమే(12న) వెల్లడైన   రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 4.4%కు దిగివచ్చినప్పటికీ, ఈ సోమవారం విడుదలకానున్న టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ)పై ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని వివరించారు. వీటితోపాటు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలూ కీలకంగా నిలవ నున్నట్లు తెలిపారు.

విదేశీ సంకేతాలూ
అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ స్టాక్ మార్కెట్ల తీరు సైతం ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు అంచనా వేశారు. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సెంటిమెంట్‌కు కీలకంగా నిలవనున్నట్లు తెలిపారు. ఇక విదేశీ మార్కెట్లలో తాజాగా ముడిచమురు ధరలు ఐదేళ్ల కనిష్టానికి దిగిరావడం తెలిసిందే. ఇలాంటి పలు అంశాలు సమీప కాలానికి దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
 
ముందస్తు పన్ను చెల్లింపులు...
గత వారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డ ఐఐపీ, సీపీఐ గణాంకాలకు అనుగుణంగా మార్కెట్లు స్పందించే అవకాశమున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ చెప్పారు. ఇక ఈ సోమవారం విడుదలకానున్న డబ్ల్యూపీఐ కూడా సెంటిమెంట్‌కు కీలకంగా నిలవనుందని తెలిపారు. ఇవికాకుండా కార్పొరేట్ సంస్థల ముందస్తు పన్ను చెల్లింపు వివరాలకూ ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. వీటి ఆధారంగానే కంపెనీల క్యూ3(అక్టోబర్-డిసెంబర్) ఫలితాలపై అంచనాలకు వచ్చే వీలుంటుందని తెలియజేశారు. ఈ నెల 23తో ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపైనే ఇన్వెస్టర్లు దృష్టినిలుపుతారని చెప్పారు.

మరింత దిగువకు..: ప్రస్తుత పరిస్థితుల ప్రకారం కూడా  ఈ వారం మార్కెట్లు దిద్దుబాటుకు లోనవుతాయని అంచనా వేస్తున్నట్లు జయంత్ చెప్పారు. పలు అంశాల నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూస్తాయని, ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని వివరించారు. కాగా,  అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష ఈ నెల 16-17న జరగనుంది. ఈ వివరాలతోపాటు, పార్లమెంట్ సమవేశాల్లో చర్చకురానున్న బీమా బిల్లు, సంస్కరణలు, తదితర ప్రభుత్వ చర్యలకూ ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తారని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఎంటీ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు.
 
రూ. 10 లక్షల కోట్లకు విదేశీ పెట్టుబడులు
ఇప్పటివరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవహించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) మొత్తం పెట్టుబడులు రూ. 10 లక్షల కోట్లను అధిగమించాయి. ఇందుకు ఈ ఏడాది(2014) జనవరి నుంచి ఇన్వెస్ట్‌చేసిన రూ. 2.6 లక్షల కోట్లు(43.4 బిలియన్ డాలర్లు) కూడా జత కలిశాయి. వీటిలో ఈక్విటీలలో రూ. 1.05 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయగా, రూ. 1.6 లక్షలను బాండ్ల కొనుగోలుకి వెచ్చించారు. ఈక్విటీలకు సంబంధించి ఎఫ్‌పీఐలు ఒక ఏడాదిలో రూ. లక్ష కోట్ల స్థాయిలో ఇన్వెస్ట్‌చేయడం ఇది నాలుగోసారి మాత్రమే. ఇంతక్రితం 2013, 2012, 2010లలోనూ రూ. లక్ష కోట్లకుపైగా ఇన్వెస్ట్ చే శారు. 1992లో తొలిసారి విదేశీ ఇన్వెస్టర్లను దేశీ క్యాపిటల్ మార్కెట్లోకి అనుమతించిన సంగతి తెలిసిందే.

అప్పటినుంచీ చూస్తే నికరంగా దేశీ ఈక్విటీలలో రూ. 8 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు రూ. 2.6 లక్షల కోట్లను రుణ సెక్యూరిటీల కొనుగోలుకి వినియోగించారు. వెరసి మొత్తం ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు 10.54 లక్షల కోట్లను(214 బిలియన్ డాలర్లకుపైనే) తాకాయి. వివిధ రకాల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను సెబీ ఇటీవలే ఎఫ్‌పీఐలుగా వర్గీకరించింది. స్వల్పకాలిక పెట్టుబడులుగా భావించే ఈ నిధులను హాట్‌మనీగా మార్కెట్ వ్యవహరిస్తుంది. దీర్ఘకాలిక నేపథ్యంగల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) కోవలోకి ఇవిరాకపోగా, ఎప్పుడైనా మార్కెట్ల నుంచి వెనక్కి(విదేశాలకు) మళ్లిపోతుంటాయి. కాగా, 2014 సంవత్సరం ముగియడానికి ఇంకా 2 వారాల గడువున్న నేపథ్యంలో ఈ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement