కార్లు... డిస్కౌంట్లు..!
♦ ధర తగ్గింపులో వాహన సంస్థల క్యూ
♦ ఈ నెల చివరి వరకే ఆఫర్లు
న్యూఢిల్లీ: జీఎస్‌టీ అమలుతో ధరలు దిగివస్తాయని ఎదురు చూస్తున్న కస్టమర్లను ప్రసన్నం చేసుకోవడానికి కార్ల తయారీ కంపెనీలు ఇప్పటి నుంచే పరిమి తకాల డిస్కౌంట్ ఆఫర్లకు తెరతీశాయి. జీఎస్‌టీ అమలు కన్నా ముందే వాహన రకాన్ని బట్టి రూ.2.5 లక్షల వరకు తగ్గింపును ప్రకటించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా, నిస్సాన్, మహీంద్రా, ఫోర్డ్, నిస్సాన్ వంటి కంపెనీలు పలు భిన్నమైన ఆఫర్లతో కస్టమర్ల తలుపు తడుతున్నాయి. అయితే ఈ డిస్కౌంట్లు జూన్ నెలకు మాత్రమే పరిమి తం.
ఆ ఆఫర్లేంటే ఒకసారి చూద్దాం..
⇔ మారుతీ సుజుకీ డీలర్లు రూ.25,000–రూ.35,000 శ్రేణిలో డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్టోపై గరిష్ట డిస్కౌంట్‌ను పొందొచ్చు.
⇔ మహీంద్రా కంపెనీ తన వాహనాలపై రూ.27,000 నుంచి రూ.90,000 శ్రేణిలో డిస్కౌంట్‌ను అందిస్తోంది. జూన్ 30 వరకే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
⇔ హ్యుందాయ్ మోటార్ ఇండియా డీలర్లు రూ.25,000– రూ.2.5 లక్షల శ్రేణిలో డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఎలైట్ ఐ20పై రూ.25,000, ప్రీమియం ఎస్‌యూవీ సాంటాఫేపై రూ.2.5 లక్షల తగ్గింపు పొందొచ్చు. ఈయాన్‌పై రూ.45,000, గ్రాండ్ ఐ10పై రూ.73,000 వరకు, వెర్నాపై రూ.90,000 వరకు డిస్కౌంట్ పొందచ్చు.
⇔ హోండా కార్స్ ఇండియా హ్యాచ్‌బ్యాక్ కారు బ్రియోపై రూ.14,500 వరకు, కాంపాక్ట్ సెడా న్ అమేజ్‌పై రూ.50,000, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్‌పై రూ.17,000, బి–ఆర్‌వీపై రూ.60,000 డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లు జూన్ నెలకే పరిమితం.
⇔ ఫోర్డ్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్, సెడాన్ యాస్సైర్, హ్యాచ్‌బ్యాక్ ఫిగో మోడళ్లపై రూ.30,000 వరకు జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. ఎకోస్పోర్ట్‌పై రూ.20,000–రూ.30,000 శ్రేణిలో.. ఫిగో, యాస్సైర్‌లపై రూ.10,000–రూ.25,000 శ్రేణిలో డిస్కౌంట్ ఇస్తోంది.
⇔ నిస్సాన్ డీలర్లు కూడా స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ టెరానోపై రూ.80,000 వరకు, స్మాల్ కారు మైక్రాపై దాదాపు రూ.25,000 డిస్కౌంట్‌ను ఇస్తున్నారు.
⇔ జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి ఇప్పటికే తన కార్ల ధరలను రూ.10 లక్షల వరకు తగ్గించింది. ఈ తగ్గింపు జూన్ 30 వరకే ఉంటుంది. బీఎండబ్ల్యూ కూడా ఎక్స్‌షోరూమ్ ధరల్లో 12 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. మెర్సిడెస్ బెంజ్ వాహన ధరలను రూ.7 లక్షల వరకు తగ్గించింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.10.9 లక్షల వరకు ధరల్లో కోత విధించింది.
తప్పనిసరి తగ్గింపే..: నిపుణులు
కార్ల తయారీ కంపెనీలు వేరేదారిలేక తప్పని పరిస్థితిలో ఆఫర్లను ప్రకటిస్తున్నాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూలై 1 నుంచి వస్తు, సేవల పన్ను జీఎస్‌టీ అమలు తర్వాత వాహన ధరలు తగ్గుతాయనే అంచనాతో కస్టమర్లు ఇప్పుడు కొనుగోలుకు దూరంగా ఉండొచ్చని, అందుకే వారిని ఆకట్టుకోవడానికి కంపెనీలు ఈ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయని వివరించారు.
28 శాతం స్లాబ్ కిందకు కార్లు..
జీఎస్‌టీ ప్రకారం కార్లు 28 శాతం పన్ను రేటు పరిధిలోకి వస్తాయి. దీనికి 1–15 శాతం సెస్సు అదనం. 1,200 సీసీలోపు సామర్థ్యపు ఇంజిన్లను కలిగిన చిన్న పెట్రోల్ కార్లకు 1 శాతం సెస్సు వర్తిస్తుంది. అదే 1,500 సీసీలోపు సామర్థ్యం కలిగిన డీజిల్ ఇంజిన్ కార్లకు 3 శాతం సెస్సు పడుతుంది. ఇక 1,500 సీసీకి పైన ఇంజిన్లను కలిగిన పెద్ద కార్లు, 4 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు కలిగి 1,500 సీసీకు పైన ఇంజిన్ కలిగిన ఎస్‌యూవీలకు 15 శాతం సెస్సు వడ్డింపు ఉంటుంది.