మారుతీ సుజుకీ ‘స్విఫ్ట్’ సేఫ్టీ క్రాష్ టెస్ట్
న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ ‘స్విఫ్ట్’ భద్రతా ప్రమాణాల పరీక్షలో నిరాశ పరిచింది. కేవలం 2-స్టార్ రేటింగ్‌ను మాత్రమే ఈ కారు సాధించింది. గ్లోబల్ న్యూకార్ అసెస్‌మెంట్ ప్రొగ్రామ్(జీఎన్‌సీఏపీ), ‘‘సేఫర్ కార్స్ ఫర్ ఇండియా’ క్యాంపెయిన్‌లో భాగంగా మారుతీ సుజుకీ స్విఫ్ట్ క్రాష్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలు పూర్తిగా నిరాశజనకంగా ఉన్నట్టు వాహనదారులు పెదవి విరుస్తున్నారు.
జీఎన్‌ఏసీపీ ప్రకారం... కారు పెద్దల భద్రతకు సంబంధించిన ప్రమాణాలను అందుకోలేకపోయిందని తెలిసింది. అంతేకాక ప్రమాద సమయంలో కారు డ్రైవర్ తల, మెడకు రక్షణ లభిస్తున్నా.. ఛాతీ, మోకాళ్లకు మాత్రం గాయాలయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ లేటెస్ట్ వెర్షన్‌లో రెండు స్టాండర్డ్ డబుల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నా.. 4-ఛానల్ యాంటీలాక్ బ్రేకింగ్ వ్యవస్థ లేకపోవడంతో కేవలం 2-స్టార్ రేటింగ్‌నే పొందినట్టు తెలిపింది. పెద్దలకు, చిన్నారులకు రక్షణ విషయంలో కేవలం 2-స్టార్ రేటింగ్‌నే పొందినట్టు పేర్కొంది.
‘భారత్‌లో విక్రయిస్తున్న కొత్త మోడల్ స్విఫ్ట్ కార్లలో రెండు స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్‌లున్నాయి. భారత ప్రభుత్వపు కొత్త క్రాష్ టెస్ట్ రెగ్యులేషన్ ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే భారత్‌లో విక్రయించే స్విఫ్ట్ కార్ల కంటే యూరప్, జపాన్‌లలో విక్రయించే కార్లే సురక్షిత ప్రయాణం విషయంలో మెరుగైన రేటింగ్‌ను సాధించాయి. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ భారత్‌లో తన ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది’ అని జీఎన్‌సీఏపీ సెక్రటరీ జనరల్ డేవిడ్ చెప్పారు. స్థానికంగా తయారు చేసే బ్రిజా మోడల్స్‌ను అత్యంత భద్రతా ప్రమాణాలతో మారుతీ సుజుకీ రూపొందిస్తోందని, ఇదే ఫార్ములాను స్విఫ్ట్‌కు అవలంభించాలని, కనీసం యూరోపియన్, జపనీస్ వెర్షన్‌లకు అందుబాటులో ఉన్న భద్రతా ఫీచర్లనైనా తీసుకు రావాలని జీఎన్‌సీఏపీ టెక్నికల్ డైరెక్టర్ అలెజాండ్రో ఫ్యూరస్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment