టాప్-10లో ఏడు మారుతీ కార్లే!!
న్యూఢిల్లీ: ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ... దేశీ మార్కెట్లో తన హవా కొనసాగిస్తోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 ప్యాసెంజర్ కార్లలో ఏడు మారుతీవే కావటం గమనార్హం. ఏప్రిల్ నెలకు సంబంధించి విడుదలైన ఈ గణాంకాల్లో మారుతీ అల్టో అగ్రస్థానంలో ఉంది. దీని విక్రయాలు 16,583 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఆటో మొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తాజా అల్టో తర్వాతి స్థానాల్లో మారుతీ స్విఫ్ట్ (15,661 యూనిట్లు), మారుతీ వేగన్ ఆర్ (15,323 యూనిట్లు), హ్యుందాయ్ ఎలైట్ ఐ20 (11,147 యూనిట్లు), మారుతీ డిజైర్ (10,083 యూనిట్లు), హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 (9,840 యూనిట్లు), రెనో క్విడ్ (9,795 యూనిట్లు), మారుతీ బాలెనో (9,562 యూనిట్లు), మారుతీ సెలెరియో (8,548 యూనిట్లు), మారుతీ ఓమ్ని వ్యాన్ (8,356 యూనిట్లు) వరుసగా ఉన్నాయి. కాగా గతేడాది ఇదే సమయంలో జాబితాలో స్థానం పొందిన హోండా సిటీ, మహీంద్రా బొలెరో, హ్యుందాయ్ ఇయాన్ కార్లు ఈసారి ఆ ఫీట్‌ను అందుకోవడంలో విఫలమయ్యాయి.