
న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ న్యూ డిజైర్ అమ్మకాల్లో దూసుకుపోతుంది. లాంచ్ అయిన ఐదున్నర నెలల్లోనే లక్ష యూనిట్ల మార్కును చేధించింది. 2017 మే నెలలో ఈ మూడో తరం డిజైర్‌ను మారుతీ లాంచ్ చేసింది. లక్ష యూనిట్ల సేల్స్ మార్కును చాలా త్వరగా సాధించినట్టు మారుతీ సుజుకీ ఇండియా తన ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త డిజైర్ బ్రాండును మొత్తం కొత్త లెవల్‌లో యువత కోసం డిజైన్ చేసినట్టు మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్‌ఎస్ కల్సి చెప్పారు. అనతికాలంలోనే ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో ఇది అత్యంత పాపులర్ బ్రాండ్ స్థాయికి ఎదిగిందని తెలిపారు. పూర్తిగా కొత్త హీయర్టెక్ట్ ప్లాట్ ఫామ్ ను ఆధారం చేసుకుని, దీన్ని మారుతీ సుజుకీ రూపొందించింది.
ఆటో గేర్ సిఫ్ట్(ఏజీఎస్) టెక్నాలజీని కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారని, 2017 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఏజీఎస్ వేరియంట్‌ను కస్టమర్లు ఎంపికచేసుకోవడం 17 శాతం పెరిగిందని మారుతీ సుజుకీ తెలిపింది. స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, మిర్రర్ లింక్ టెక్నాలజీలతో ఈ మోడల్‌ను రూపొందించింది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. డీజిల్ వెర్షన్ లీటర్‌కు 28.4 కిలోమీటర్ల మైలేజ్‌ను, పెట్రోల్ వెర్షన్ లీటర్‌కు 22 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.