విదేశీ షేర్లలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు | May invest in foreign shares | Sakshi
Sakshi News home page

విదేశీ షేర్లలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు

Published Sun, Dec 27 2015 11:50 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

విదేశీ షేర్లలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు

విదేశీ షేర్లలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు

మనం ఉండేది ఇండియాలో. ఇక్కడి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడదామంటే అదేపనిగా తగ్గుతున్నాయి తప్ప పెరగటం లేదు. ఈ మధ్య తీవ్రమైన హెచ్చుతగ్గులు కూడా చాలా సహజమైపోయాయి. మరోవంక అమెరికా మార్కెట్లు అదేపనిగా పెరుగుతున్నాయి. చైనా కూడా ఆ మధ్య బాగా పడి... ఇప్పుడు పెరగటం మొదలు పెట్టింది. సరే! మనం విదేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలంటే మార్గమేంటి? నేరుగా ఇన్వెస్ట్ చేయొచ్చా? అక్కడ పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్లేమైనా ఉన్నాయా? అవన్నీ వివరించేదే ఈ కథనం...

అవకాశం కల్పిస్తున్న గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్
* రాబడిపై మాత్రం కరెన్సీ; రాజకీయ ప్రభావాలు  పోర్టు ఫోలియో వైవిధ్యంగా ఉండాలంటే ఇదో మార్గం
* ఇన్వెస్ట్‌మెంట్ల రాబడిపై మాత్రం పన్ను చెల్లించాల్సిందే
 

దేశీ ఇన్వెస్టర్లు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం కల్పించే వేదికే గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. దేశీ మ్యూచువల్ ఫండ్ హౌస్ (ఏఎంసీ)లు కొన్ని ప్రత్యేకంగా ఈ పథకాలను అందిస్తున్నాయి. ఆయా దేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి తగిన స్కీముల్ని ఈ ఫండ్ హౌసెస్ అమలుచేస్తున్నాయి. అయితే ఈ ఫండ్లు నేరుగా విదేశీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయవు. ఎందుకంటే అక్కడి స్థితిగతులు లోకల్ మ్యూచువల్ ఫండ్లకే బాగా తెలుస్తాయి.

అందుక ని ఈ ఫండ్లు... వివిధ దేశాల్లోని మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే వీటిని గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌గా పిలుస్తారు. టెక్నాలజీ వల్ల ప్రపంచం మొత్తం ఒకే మార్కెట్‌లా మారుతున్న నేపథ్యంలో దేశీ ఇన్వెస్టర్లు అంతర్జాతీయ పరిణామాల వల్ల ప్రయోజనం పొందటానికి ఈ గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉపకరిస్తాయి. నిజానికి ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేక రంగ వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు లాటిన్ అమెరికా కమోడిటీస్‌కు, ఆసియా ప్రాంతం సర్వీసెస్‌కు అనుకూలం. అదే అమెరికా తీసుకుంటే... అది అత్యంత భిన్నమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు కీలకమైన మార్కెట్.

బ్రిక్స్ మార్కెట్లయితే బాగా ఆశాజనక వృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థల సమూహం, ఇలా వివిధ ప్రాంతాలు వివిధ రంగాలకు అనుకూలం కావటంతో అక్కడ ఆయా రంగాల్లో ఇన్వెస్ట్ చేయటానికి ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉపయోగపడతాయి.
 
ఫండ్స్‌తో డైవర్సిఫికేషన్..

మీ పోర్ట్‌ఫోలియో విభిన్నంగా ఉండటానికి గ్లోబల్ ఫండ్స్ బాగా పనికొస్తాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయటం వల్ల మార్కెట్ విస్తృతి పెరుగుతుంది. అంతేకాక గ్లోబల్ మార్కెట్లన్నీ కూడా ఒకే దిశలో పయనించవు. అంటే కొన్ని పెరగొచ్చు, కొన్ని తగ్గొచ్చు. అందుకే గ్లోబల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ల అస్థిరతల నుంచి మన పోర్ట్‌ఫోలియోను రక్షించుకోవచ్చు.
 
పన్ను విధానం..
 గ్లోబల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే.. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో మనం పెట్టుబడి పెడుతున్నట్లు లెక్క. గ్లోబల్ ఫండ్స్‌ను డెట్ ఫండ్‌గా పరిగణిస్తారు. డెట్ ఫండ్లపై చెల్లించినట్లే దీనిపైనా పన్నులుంటాయి. దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ల రాబడిపై 10 శాతం (ఇండెక్సేషన్ కాకుండా) పన్ను చెల్లించాలి. ఇండెక్సేషన్‌తో కలిపి అయితే 20 శాతం పన్ను కట్టాలి. స్వల్పకాల పెట్టుబడుల రాబడిపై చెల్లించే పన్ను మాత్రం ఆయా వ్యక్తుల ఆదాయ శాఖ పన్ను శ్లాబ్‌పై ఆధారపడి ఉంటుంది.
 
ఈ విషయాలను మరవొద్దు

గ్లోబల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ ఫండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దీనికోసం ఎక్కువ సమయం కేటాయించి, ఫండ్స్ గురించి అధ్యయనం చేయాలి. అంతర్జాతీయ మార్కెట్ల గురించి స్టడీ చేయాలి. వాటిని ఫాలో అవుతూ ఉండాలి. ఇలా పరిశీలించాక ఆ ఫండ్ మనకు సరిపోతుందా? లేదా? అని ఒక నిర్ణయానికి రావాలి. అలాగే ఫండ్ ఎంటర్, ఎగ్జిట్ లోడ్ తదితర చార్జీలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం తప్పనిసరి.
 
గ్లోబల్ ఫండ్స్-ప్రయోజనాలు..
* మనకు అనువైన ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు.
* దేశీ, అంతర్జాతీయ పరిణామాల వల్ల ఒక్కో దేశపు మార్కెట్లు ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటాయి. దీంతో రిస్క్ ప్రభావం తక్కువగా ఉంటుంది.
* ఇన్వెస్ట్‌మెంట్ డైవర్సిఫికేషన్ వల్ల రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.
* అవసరమైతే నిపుణులైన అంతర్జాతీయ ఫండ్ మేనేజర్ల సలహాలను తీసుకోవచ్చు.
 
గ్లోబల్ ఫండ్స్-ప్రతికూలతలు..
కరెన్సీ ప్రభావం: ఫండ్ పనితీరుతో నిమిత్తం లేకుండా గ్లోబల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్‌ను ఆయా దేశాల దేశీ కరెన్సీ బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు మీరు బ్రెజిల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. మీ ఇన్వెస్ట్‌మెంట్‌పై రాబడి రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్ల పనితీరు. రెండు బ్రెజిల్ కరెన్సీ (రియాల్) - మన కరెన్సీ (రూపాయి) మారకం విలువ. మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్లు 10 శాతం పెరిగినా... బ్రెజిల్ కరెన్సీ 10 శాతం క్షీణించినట్లయితే మీ రిటర్న్ జీరోగా భావించాల్సి ఉంటుంది.   
     
ప్రాంతీయ రాజకీయాలు: గ్లోబల్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటేనే వివిధ దేశాల మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం. అందుకే మనం ఇన్వెస్ట్ చేసే ప్రాంతాల్లో ఏవైనా  రాజకీయ సమస్యలు ఉత్పన్నమైతే వాటి ప్రభావం మన రాబడిపై ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఆయా దేశాల్లో వరదలు, భూకంపాలు వంటి ఇతర   ప్రమాదాలు సంభవిస్తే వాటి ప్రభావం ఫండ్ రాబడిపై ఉంటుంది. అందుకే భౌగోళిక వైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement