
న్యూఢిల్లీ: ఇండియన్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పరిశ్రమ నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) విలువ వచ్చే పదేళ్లలో రూ.100 లక్షల కోట్లకు చేరుతుందని మహీంద్రా ఏఎంసీ అంచనా వేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం దీనికి ప్రధాన కారణంగా నిలుస్తుందని పేర్కొంది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణ ఆస్తుల విలువ రూ.22.36 లక్షల కోట్లుగా ఉంది. ‘ప్రజలు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అధిగమించొచ్చనే నిజాన్ని వీరు తెలుసుకున్నారు. బంగారం, రియల్ ఎస్టేట్ వంటి సంప్రదాయిక ఇన్వెస్ట్‌మెంట్ ఉత్పత్తులకు దూరం జరుగుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
దీని వల్ల పరిశ్రమ ఏయూఎం విలువ వచ్చే పదేళ్లలో రూ.100 లక్షల కోట్లకు చేరొచ్చు’ అని మహీంద్రా ఏఎంసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అశుతోష్ బిష్ణోయి తెలిపారు. గురువారమిక్కడ ‘మహీంద్రా ఉన్నతి ఎమర్జింగ్ బిజినెస్ యోజన’ కొత్త స్కీమ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్‌ఎఫ్‌వో జనవరి 8 నుంచి 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పథకం ప్రధానంగా మిడ్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ‘‘2017లో 42 యాక్టివ్ ఫండ్ హౌస్‌ల ఏయూఎం విలువ 32% పెరిగింది. గత ఐదేళ్లలో చూస్తే వీటి ఏయూఎం విలువ 24% ఎగసింది. ఏయూఎం విలువ పెరుగుతూ రావడం ఇది వరుసగా ఐదో సంవత్సరం’’ అని బిష్ణోయి వివరించారు.