మొబైల్ కొంటున్నారా? | Mobile buying? | Sakshi
Sakshi News home page

మొబైల్ కొంటున్నారా?

Published Mon, May 18 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

మొబైల్ కొంటున్నారా?

మొబైల్ కొంటున్నారా?

శేఖర్ మొబైల్ ఫోన్ మార్చాలనుకున్నాడు. ఎలాగూ మారుస్తున్నాం కదా... చక్కని ఫీచర్లున్న బ్రాండెడ్ మొబైల్... అది కూడా కెమెరా, ర్యామ్, ప్రాసెసర్ అన్నీ బాగా అప్‌గ్రేడెడ్ అయి ఉంటే బాగుండుననుకున్నాడు. అందుకే... జీతంలోంచి నెలనెలా దాచిన మొత్తాన్ని తీసి దాదాపు రూ.50 వేలు పెట్టి కొత్త ఫోన్ తీసుకున్నాడు. ఇంతా చేసి పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజీ చేశాడు కానీ... దానికి గాను తగ్గించిన మొత్తం కేవలం రూ.3వేలు. కొన్నపుడేమో ఆ ఫోన్ కూడా దాదాపు 12 వేలు పెట్టి కొన్నదే. కాకుంటే ఏడాది వాడకానికే దాని ధర రూ.3 వేలకు పడిపోయింది.

సరే! పోతే పోయిందని కొత్త ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో తీసుకున్న శేఖర్ సంతోషం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇపుడు ఆఫీసులో అతనిదే లేటెస్ట్ ఫీచర్లున్న హై-ఎండ్ మొబైల్. నాలుగు నెలలు గడిచింది. ఆ రోజే కొన్న కొత్త ఫోన్‌ను తెచ్చి శేఖర్‌కు చూపించాడు రఘు. అందులో ఉన్న ఫీచర్లను వివరిస్తుంటే శేఖర్ బుర్ర తిరిగింది. ఎందుకంటే అన్నీ శేఖర్ ఫోన్‌కన్నా ఆధునిక ఫీచర్లే. కెమెరా నుంచి ర్యామ్, మెమరీ వరకూ అన్నీ ఎక్కువే. ధర మాత్రం కేవలం రూ.17,500.

శేఖర్ కొన్న బ్రాండ్ కాకపోయినా అది కూడా మంచి బ్రాండే. శేఖర్‌కు ఆ రోజంతా నిద్రపట్టలేదు. తను రూ.50వేలు పెట్టి ఫోన్ కొని నిండా నాలుగు నెలలు కాలేదు. అంతకన్నా మంచి ఫోన్... అంతకన్నా చాలా తక్కువ ధరకే!! ఎలా సాధ్యం? మర్నాడు రఘుతో ఇదే మాటంటే తనేమన్నాడో తెలుసా? నువ్వు కొన్న ఫోన్ కూడా ఇపుడు రూ.30 వేలకే వస్తోందోయ్!! అని! గతేడాది భారతదేశ మార్కెట్లోకి 1,137 మోడళ్ల మొబైల్ ఫోన్లు విడుదలయ్యాయి.

అంటే... రోజుకు 3.11 కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వచ్చి చేరాయన్న మాట. మరి ఎంత కొత్త ఫోనైనా ఇలాంటి మార్కెట్లో నెల తిరిగేసరికి పాతబడిపోతోందంటే వింతేముంది? ఇక స్మార్ట్‌ఫోన్లను చూస్తే గతేడాదికి అంతర్జాతీయంగా విడుదలైన 691 మోడళ్లలో 476 మోడళ్లు భారతీయ కంపెనీలవే. అంటే సగటున భారతీయ కంపెనీలు రోజుకు 1.3 స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయన్నమాట. మరి రోజుకో కొత్త ఫోను మార్కెట్లోకి వస్తున్నపుడు ఏ ఫోనైనా ఎన్నాళ్లు కొత్తగా ఉంటుంది చెప్పండి? అందుకే... ఫోన్లు కొనే టపుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ తరవాత బాధ పడాల్సిన అవసరం రాకపోవచ్చనేది నిపుణుల సలహా.  

- హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
   
* ఒక దాన్ని మించి మరొకదాన్లో ఫీచర్లు; ధరలోనూ పోటీ
* విడుదల చేసిన ఐదారు నెలలకే ధరలు తగ్గిస్తున్న కంపెనీలు
* అందుకే కొనేముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు
 

అవసరాన్ని తెలుసుకోండి!
* ఫోన్ కొనేముందు మీ అవసరమేంటో తెలుసుకోండి. కేవలం మాట్లాడటానికా? లేక గేమ్స్ ఆడటానికా? మంచి ఫొటోలు తీసుకోవటానికా? డిజిటల్ అసిస్టెంట్‌లా వివిధ అవసరాలకు వాడుకోవటానికా? ఇలా అవసరమేంటో తెలుసుకోవాలి.
* ఫొటోలకోసం అనుకోండి. అప్పట్లో మార్కెట్లో అత్యధిక పిక్సెల్ కెమెరాతో ఏ ఫోన్ ఉంటే అది కొనుక్కునే ప్రయత్నం చేయాలి. గేమ్స్ కోసమనుకుంటే అధిక ర్యామ్ ఉండే ఫోన్‌ను, వీడియోల కోసం తీసుకునేవారు పెద్ద డిస్‌ప్లేను చూసుకోవాలి. ఇలా మన అవసరానికి తగ్గ ఫీచర్ హైఎండ్‌లో ఉన్నది చూసుకుని మిగతా విషయాల్లో రాజీ పడొచ్చు. అప్పుడు ఫోన్ తక్కువ ధరకే వస్తుంది. - కొన్నాళ్ల తర్వాత మరిన్ని ఫీచర్లతో ఫోన్లు మార్కెట్లోకి వచ్చినా... మన అవసరానికి సంబంధించిన ఫీచర్ మాత్రం మరీ మారిపోయే అవకాశాలు తక్కువ.  బాధేమీ ఉండదు.
 
కొన్నాళ్లు వేచి చూడండి...
ఫోన్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే కొనేసుకోవాలని చాలామంది ఎదురుచూస్తుంటారు.  తరవాత మరింత హైఎండ్ ఫోన్ వస్తే అది కూడా కొనేయొచ్చునని అనుకుంటారు. అలాంటి వాళ్ల విషయంలో ఇబ్బం దులేవీ ఉండవు. కానీ ఎప్పుడో ఒకసారి దాచుకున్న సొమ్మం తా పెట్టి కొత్త ఫోన్ కొనేవారు మాత్రం మార్కెట్లోకి రాగానే కొనేయటం సరికాదు. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చాకే ఆ ఫోన్ సత్తా ఏంటో తెలుస్తుంది.

ఒకవేళ వినియోగదారులకు నచ్చకపోతే తయారు చేసిన స్టాకంతా విక్రయించాలి కనుక రేటు తగ్గించి అమ్మటానికి కంపెనీలు ప్రయత్నిస్తాయి. బాగా సక్సెస్ అయిన ఒకటిరెండు మోడళ్లు మినహా ఏ మోడల్ ధరైనా కొద్ది నెలలకే దాదాపు 30-40% తగ్గిపోవటానికి ప్రధాన కారణమిదే. అందుకని కాస్త వేచిచూస్తే బెటర్.
 
హోంవర్క్ చేస్తే మంచిది...
ఏదైనా ఫోన్ కొనాలనుకున్నపుడు దాని ఫీచర్లు, ధర ఇతరత్రా వివరాలు తెలుసుకుని... మార్కెట్లో అలాంటి ఫీచర్లున్న ఇతర ఫోన్ల ధరలు కూడా ఎంతున్నాయో తెలుసుకోవాలి. ఇపుడు చాలా దుకాణాలు ఇలాంటి కంపేరిజన్‌ను అందిస్తున్నాయి. ఇక ఆన్‌లైన్ సైట్లయితే చెప్పనే అక్కర్లేదు. ఏ ఈ-కామర్స్ వెబ్‌సైట్లోకి వెళ్లినా మూడు నాలుగు ఫోన్లను ఎంచుకుని వాటిలో ఫీచర్లను, ధరను పోల్చి చూసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇలా కొన్ని ఫోన్లను పోల్చి చూసుకున్నాకే ఎంచుకుంటే, తక్కువ ధరకే నచ్చిన ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
 
ధరలెందుకు తగ్గుతున్నాయంటే...
కస్టమర్లు తక్కువ ధరలో అధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2013లో సగటు స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,118 ఉంటే, 2014లో ఈ ధర రూ.6,603కు వచ్చి చేరిందని 91 మొబైల్స్ సంస్థ ఒక నివేదికలో తెలియజేసింది. 2013, 2014 సంవత్సరాల గణాంకాలను బట్టి చూస్తే రూ.5,000-15,000 ధరలో కంపెనీలు అత్యధిక మోడళ్లను ప్రవేశపెట్టాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ వ్యయం రోజురోజుకూ తగ్గుతుండడమే. చిప్ తయారీ కంపెనీలు, సాంకేతిక సేవల సంస్థలు మొబైల్ ఫోన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తక్కువ ధరకే విడిభాగాల్ని, టెక్నాలజీని అందిస్తున్నాయి.
 
ధరలెందుకు తగ్గుతున్నాయంటే..
కస్టమర్లు తక్కువ ధరలో అధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2013లో సగటు స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,118 ఉంటే, 2014లో ఈ ధర రూ.6,603కు వచ్చి చేరిందని 91 మొబైల్స్ సంస్థ ఒక నివేదికలో తెలియజేసింది. 2013, 2014 సంవత్సరాల గణాంకాలను బట్టి చూస్తే రూ.5,000-15,000 ధరలో కంపెనీలు అత్యధిక మోడళ్లను ప్రవేశపెట్టాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ వ్యయం రోజురోజుకూ తగ్గుతుండడమే. చిప్ తయారీ కంపెనీలు, సాంకేతిక సేవల సంస్థలు మొబైల్ ఫోన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తక్కువ ధరకే విడిభాగాల్ని, టెక్నాలజీని అందిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement