
మార్కెట్లో ‘మోదీ’ మెరుపులు!
♦ రికార్డ్ స్థాయికి చేరిన సింగపూర్ నిఫ్టీ ఫ్యూచర్స్
♦ అమెరికా మార్కెట్లో భారత ఏడీఆర్‌లదీ అదే జోరు
♦ నేడు నిఫ్టీ ర్యాలీ చేస్తుందనటానికి సంకేతాలు
ముంబై: విశ్లేషకులు, మీడియా అంచనాలకు అందని విధంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయాన్ని సాధించటం స్టాక్ మార్కెట్‌కు కిక్కునిస్తోంది. భారత మార్కెట్లకు సోమవారం హోలీ సందర్భంగా సెలవైనా... మన మార్కెట్లకు సూచీలా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఫ్యూచర్స్ మాత్రం కొత్త రికార్డ్ స్థాయిలను తాకింది. మరోవంక సోమవారం న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో మన షేర్ల ఏడీఆర్‌లు కూడా మంచి దూకుడు కనబరిచాయి. ఈ జోష్‌తో మంగళవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా పాత రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త శిఖరాలను తాకుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఈ ఎన్నికల్లో అనూహ్య విజయంతో మోదీ సర్కార్ మరింత దూకుడుగా సంస్కరణలు తెస్తుందని... ఇది భారత మార్కెట్లపై విదేశీ మదుపరుల సానుకూలతను మరింత పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అంచనాలను పెంచిన ఫలితాలు...
జీఎస్‌టీని తీసుకురావడం, విదేశీ పెట్టుబడుల నిబంధనలు ఉదారంగా మరింతగా సరళీకరించడం, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణగా, 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా ఈ ఎన్నికలను అందరూ పరిగణించారు. వీటిలో బీజేపీ విజయం సాధిస్తుందని అందరూ అంచనా వేశారని, కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారీ విజయం సాధించడం ఆశ్చర్యపరిచిందని నొముర హోల్డింగ్స్ వ్యూహకర్త వివేక్ రాజ్‌పాల్ చెప్పారు. మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలను ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయని, ఇది మార్కెట్లకు సానుకూలమని ఆయన వ్యాఖ్యానించారు.
ఎస్‌జీఎక్స్ నిఫ్ట@9,200
సింగపూర్‌లో సోమవారం ఎస్‌జీఎక్స్ నిఫ్టీ–50 ఇండెక్స్ ఫ్యూచర్స్ ఒకదశలో 250 పాయింట్లకు పైగా పెరిగి 9,200 పాయింట్లను తాకింది. ఇది ఆల్‌టైమ్ గరిష్టం. తరవాత కాస్త తగ్గి ట్రేడవుతోంది. మరోవైపు అమెరికా స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో ఉన్న ఆరు భారత ఏడీఆర్‌లు (విప్రో మినహా) మంచి జోరును చూపిస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్ (అమెరికన్ డిపాజిటరీ రిసీట్) 6 శాతానికి పైగా లాభంతో ట్రేడవుతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడీఆర్ 2.2 శాతం, టాటా మోటార్స్ ఏడీఆర్ 2 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1 శాతం లాభాలతో ట్రేడవుతుండగా, ఇన్ఫోసిస్ ఏడీఆర్ 0.2 శాతం లాభంతో, విప్రో స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఈ షేర్లన్నింటికీ నిఫ్టీలో వెయిటేజీ బాగా ఉన్నందున జీవిత కాల గరిష్ట స్థాయిని నేటి ట్రేడింగ్‌లో నిఫ్టీ అందుకునే అవకాశాలు అధికంగా ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2015, మార్చి 4న నిఫ్టీ 9,119 పాయింట్లను తాకింది. ఇదే నిఫ్టీకి జీవిత కాల గరిష్ట స్థాయి. గత శుక్రవారం నిఫ్టీ 8,935 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఈ రికార్డ్ స్థాయికి చేరడానికి 185 పాయింట్ల దూరంలోనే ఉంది.
ఎస్‌జీఎక్స్ నిఫ్టీ సూచిక...: సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఫ్యూచర్స్‌లో భారత కాలమానం ప్రకారం ఉదయం 6.30కే ట్రేడింగ్ మొదలవుతుంది. సాధారణంగా ఉదయం 9 గంటల సమయంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఎంత ఉంటే... మన మార్కెట్లు కూడా అదే స్థాయిలో ఆరంభం కావటం జరుగుతుంది. అందుకే ఎస్‌జీఎక్స్ నిఫ్టీని మన మార్కెట్లకు సంకేతంగా భావిస్తుంటారు.
అప్రమత్తంగా ఉండాలి...: బీజేపీ ఘన విజయం ప్రభావం తాత్కాలికమేననేది విశ్లేషకుల మాట. ఎన్నికల తర్వాత వచ్చే ఏ ర్యాలీ లేదా పతనమైనా స్వల్పకాలమేని పేర్కొంటున్నారు. నిఫ్టీ కొత్త స్థాయిని తాకితే ఒకింత ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. సంస్కరణల పురోగతిని బట్టే స్టాక్ మార్కెట్ భవిష్యత్ గమనం ఉంటుందని చెబుతున్నారు.