
ఎన్నికల ఫలితాలు.. ‘డీజిల్’ ఇంధనం!
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా ఎఫెక్ట్
* డీజిల్‌పై నియంత్రణల ఎత్తివేత సానుకూలం
* బ్యాంకింగ్ దిగ్గజాల ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి
* మార్కెట్ల గమనంపై నిపుణుల అంచనాలు
* ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం
* 23న సాయంత్రం ముహూరత్ ట్రేడింగ్
ఈ వారం స్టాక్ మార్కెట్ల నడకను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మహారాష్ర్ట, హర్యానా అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ హవా కనిపించడంతో సెంటిమెంట్ మెరుగుపడనుందని తెలిపారు. ఫలితంగా మరిన్ని సంస్కరణలకు తెరలేస్తుందన్న అంచనాలు పెరిగాయని తెలిపారు. ఈ బాటలో ఇప్పటికే ప్రభుత్వం డీజిల్ ధరలపై నియంత్రణలు ఎత్తివేయగా, గ్యాస్ ధరను 33% పెంచుతూ నిర్ణయించడాన్ని ప్రస్తావించారు.
వీటికితోడు గడిచిన శుక్రవారం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం కూడా ఇందుకు దోహదపడనుందని తెలిపారు. వెరసి సోమవారం ట్రేడింగ్‌లో ఈ జోష్ కనిపించవచ్చునని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి అంచనా వేశారు. వీటికితోడుగా ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్(క్యూ2)లో దిగ్గజ బ్యాంకులు ప్రకటించ నున్న ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ తెలిపారు.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు కూడా ట్రెండ్‌ను ప్రభావితం చేయవచ్చునని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇటీవల ఎఫ్‌ఐఐలు ఈక్విటీలలో నికర అమ్మకందారులుగా నిలుస్తుండగా, డాలరు మారకంలో రూపాయి దాదాపు 62కు బలహీనపడటం గమనార్హం.
గంటపాటు ట్రేడింగ్: ఈ వారం కూడా ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. గురువారం(23న) దీపావళికాగా, శుక్రవారం(24న) దివాలీ బలిప్రతిపద కారణంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. ఈ నెలలో ఇప్పటికే 2, 3, 6, 15న సెలవులు కారణంగా మార్కెట్లు పలుమార్లు పనిచేయని సంగతి తెలిసిందే. అయితే దీపావళి పర్వదినం సందర్భంగా గురువారం సాయంత్రం 6:15 నుంచి 7:30 వరకూ స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి.
జాబితాలో బ్లూచిప్స్
జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి ఈ వారంలో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తోపాటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), కొటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, కెయిర్న్ ఇండియా ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. కాగా, చమరు ధరలు నిరంతరంగా పతనంకావడం అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మందగమన పరిస్థితులపై ఆందోళనలు రేకెత్తిస్తున్ననదని సియాన్స్ అనలిటిక్స్ సీఈవో అమన్ చౌదరి పేర్కొన్నారు. వీటికితోడు ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తుండటం, యూరోజోన్ రుణభయాలు వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని చెప్పారు. దేశీయంగా చూస్తే చమురు ధరల పతనం సానుకూల పరిణామమేనని, బ్లూచిప్ కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటిస్తే మార్కెట్లు బలపడతాయని అమన్ వివరించారు.
నాలుగో వారమూ...
వారం ప్రాతిపదికన గత మూడు వారాలుగా దేశీ మార్కెట్లు నష్టాలనే మిగిల్చుకుంటూ వస్తున్నాయి. ఈ బాటలో గడిచిన వారంలో సైతం సెన్సెక్స్ నికరంగా 189 పాయింట్లు క్షీణించి 26,108 వద్ద ముగిసింది. నిజానికి మార్కెట్ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని, భవిష్యత్‌లో మరింత వృద్ధిని చూపేందుకే అవకాశముందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా వేశారు.