కీలకమైన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న ఉత్సాహంతో...ఎన్నికలు జరగబోయే జార్ఖండ్, జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాల్లో సైతం అవే ఫలితాలను సాధించగలమన్న ఆత్మవిశ్వాసంతో బీజేపీ ఉన్న వేళ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సోమవారంతో మొదలుపెట్టి వచ్చే నెల 23 వరకూ సాగే ఈ సమావేశాలు వేడి వేడిగానే కొనసాగవచ్చునని స్పీకర్ సుమిత్రా మహాజన్ శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంతోనే తేటతెల్లమైంది.
ప్రధాన పక్షాలైన తృణమూల్, సమాజ్‌వాదీ, వామపక్షాల ప్రతినిధులు దీనికి హాజరుకానే లేదు. ఎన్డీయే సర్కారు అధికారంలోకొచ్చి ఆరునెలలు పూర్తవుతుండగా జరిగే ఈ సమావేశాల సమయంలోనే జార్ఖండ్, జమ్మూ-కాశ్మీర్ ఫలితాలు కూడా వెలువడతాయి. జార్ఖండ్‌లో బీజేపీ విజయంపై ఎవరికీ సంశయం లేదు. జమ్మూ-కాశ్మీర్‌ను సైతం చేజిక్కించుకోగలమని బీజేపీ నేతలు చెబుతున్నా అక్కడ ఆ పార్టీ కీలక నిర్ణయాత్మక శక్తిగా అవతరించగలదన్న అంచనాలున్నాయి.
మహారాష్ట్రలో బెట్టుచేసిన శివసేన సైతం బీజేపీకి దగ్గరై అక్కడి ప్రభుత్వంలో చేరడానికి సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఇలా ఎటుచూసినా తనకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా అవలీలగా ఎదుర్కొనగలమన్న ఆత్మవిశ్వాసం బీజేపీ పెద్దల్లో దండిగా ఉన్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యాల పరంపరను కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాల్లో ఏమేరకు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలదో చూడవలసి ఉన్నది. లోక్‌సభలో విపక్ష నేత పదవికి అర్హత పొందగల స్థాయిలో ఆ పార్టీకి సంఖ్యాబలం లేని స్థితిలో సీవీసీ, లోక్‌పాల్, సీబీఐ వంటి సంస్థలకు అధిపతులను నిర్ణయించే ఎంపిక కమిటీలో ఆ పార్టీకి స్థానం ఇస్తారా, ఇవ్వరా అన్న సంశయం చాన్నాళ్లనుంచి ఉంది. సభా నిబంధనల ప్రకారం చూసినా, సంప్రదాయాలనుబట్టి చూసినా కనీసం 55 స్థానాలున్న పార్టీకే విపక్ష నేత పదవి ఇవ్వాలని బీజేపీ వాదిస్తున్నది.
అయితే అందుకు సంఖ్యాబలంతో సంబంధం లేదని, ప్రతిపక్షాల్లో తామే ఎక్కువ సీట్లు గెల్చుకున్నాం గనుక తమకే ఆ పదవి లభించాలని కాంగ్రెస్ డిమాండు చేస్తున్నది. తాజాగా సీబీఐ చీఫ్ ఎంపిక వ్యవహారం వచ్చిపడిన నేపథ్యంలో సభలో విపక్షంనుంచి అత్యధిక స్థానాలున్న పార్టీగా కాంగ్రెస్‌కు ఎంపిక కమిటీలో అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినందువల్ల ఆ కోరిక తీరినట్టయింది. పూర్వపు జనతాపార్టీ నుంచి విడివడి ఏర్పడిన సమాజ్‌వాదీ, జేడీ(యూ), ఆర్జేడీ, జేడీ(ఎస్), ఐఎన్‌ఎల్‌డీ వంటి పార్టీలు ఈ సమావేశాల్లో కలిసి అడుగులేయాలని తీర్మానించుకున్నాయి.
లోక్‌సభలో ఈ పార్టీలకున్న బలం 15 సీట్లే అయినా రాజ్యసభలో 25 స్థానాలతో ప్రభుత్వానికి గట్టి సవాలే విసరనున్నాయి. పశ్చిమబెంగాల్‌లో వెల్లడైన శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో తమ పార్టీ నేతలనూ, ఎంపీలనూ ఇరికించి అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారని అక్కడి అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహంతో ఉంది. అంతేకాదు...బర్ద్వాన్‌లో జరిగిన పేలుళ్ల వ్యవహారం మొత్తం బీజేపీ సృష్టి అనీ, తమను దోషుల్ని చేయడానికి పన్నిన కుట్రలో భాగమని ఆ పార్టీ అంటున్నది. ధైర్యం ఉంటే తమ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని సవాల్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో పార్లమెంటులో తృణమూల్ ఘర్షణ వైఖరే తీసుకుంటుందని వేరే చెప్పనవసరం లేదు.
ఇన్ని పార్టీలు కలిసినా లోక్‌సభ వరకైతే ఎన్డీయే సర్కారును ఇరకాటంలో పెట్టలేవన్నది నిజం. అయితే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యమంటే కేవలం సంఖ్యాబలం ఒక్కటే కాదు. చాలినంత మెజారిటీ ఉన్నా పాలించడానికి యూపీఏ సర్కారు గడిచిన అయిదేళ్లలో ఎన్ని పిల్లిమొగ్గలు వేయాల్సివచ్చిందో...సభా నిర్వహణలో ఎలా విఫలమైందో అందరికీ తెలిసిందే. భిన్నాభిప్రాయాలను గౌరవించడం, అన్ని పార్టీలనూ కలుపుకొని వెళ్లడం, విపక్షం విలువైన సూచనలు చేసినప్పుడు స్వీకరించడం ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన ధోరణికి సంకేతం. అలాంటి ఔన్నత్యాన్ని ప్రదర్శించలేకపోబట్టే కాంగ్రెస్ అభాసుపాలైంది.
ఎన్డీయే సర్కారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈసారి పార్లమెంటు ముందుకు 39 బిల్లులు రానున్నాయి. వీటిల్లో అత్యంత కీలకమైనవి ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరిలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసి ఉన్నందున ఈ సమావేశాల్లో ఆర్థిక సంస్కరణలకు మార్గం సుగమం చేసే చట్ట సవరణలకు ఎన్డీయే సర్కారు సమాయత్తమవుతున్నది. బీమా సవరణ బిల్లు, కంపెనీల చట్టం సవరణ బిల్లు, జీఎస్‌టీ బిల్లు, ఔషధ చట్టం సవరణ బిల్లు, జౌళి మిల్లుల జాతీయకరణ బిల్లు వంటివి ఇందులో ముఖ్యమైనవి.
ఇవిగాక ఉపాధి హామీ, భూసేకరణ చట్టాలకు వివాదాస్పద సవరణలు చేసేందుకు ఎన్డీయే సర్కారు సిద్ధమవుతున్నది. ఈ చట్టాలను నీరుగార్చడానికి చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. రాజ్యసభలో తగినంత బలం లేని నేపథ్యంలో ఈ బిల్లుల్లో ఎన్నిటిపై ప్రభుత్వం తన మాట నెగ్గించుకోగలదో చూడాలి. మనం ఆదర్శంగా తీసుకుంటున్న బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థలో చట్టసభలు ఏడాదికి కనీసం 200 రోజులు సమావేశమవుతాయి.
అందులో నిర్మాణాత్మకమైన చర్చలు జరుగుతాయి. మన పార్లమెంటు ఏడాదికి పట్టుమని వందరోజులు కూడా సమావేశం కావడం కష్టమవుతున్నది. ఆ కొద్దిరోజులైనా సజావుగా సాగడంలేదు. అధికారపక్షంతోపాటు విపక్షాలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదు. ఈ శీతాకాల సమావేశాలు ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని నెలకొల్పాలని... చట్టసభల్లో సామాన్య పౌరులకు విశ్వాసం ఇనుమడించేలా ప్రవర్తిల్లాలని ఆశిద్దాం.
సభా పర్వం
Published Mon, Nov 24 2014 12:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement