కొత్త శిఖరాలకు మార్కెట్‌..! | Stock markets set to rally further following BJP UP state election victory | Sakshi
Sakshi News home page

కొత్త శిఖరాలకు మార్కెట్‌..!

Published Mon, Mar 13 2017 1:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కొత్త శిఖరాలకు మార్కెట్‌..! - Sakshi

కొత్త శిఖరాలకు మార్కెట్‌..!

బీజేపీ భారీ విజయంతో జోష్‌..
నేడు మార్కెట్‌కు హోలీ సెలవు
మరింత వేగంగా సంస్కరణలు
ఫెడ్‌ నిర్ణయంతో కరెక్షన్‌ !
ఈ వారం మార్కెట్‌ తీరుపై విశ్లేషకుల అంచనా


న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో స్టాక్‌ మార్కెట్‌ పండుగ చేసుకోనున్నదని విశ్లేషకులంటున్నారు. మరిన్ని ఆర్థిక సంస్కరణలు రానున్నాయనే అంచనాలతో స్టాక్‌ సూచీలు రికార్డ్‌ స్థాయిలను తాకనున్నాయని వారంటున్నారు. హోలీ కారణంగా నేడు(సోమవారం) మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం కానున్నది. అయినప్పటికీ, రానున్న రోజుల్లో బలమైన ర్యాలీ చోటు చేసుకోగలదని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత బలంగా ఇన్వెస్టర్ల విశ్వాసం..
ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయం సాధించడంతో మార్కెట్‌ కొత్త జోన్‌లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్‌ స్మార్ట్‌ ఆన్‌లైన్‌ డైరెక్టర్‌ విజయ్‌ సింఘానియా అంచనా వేస్తున్నారు. ఈ విజయంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరుగుతుందని, మరిన్ని ఆర్థిక సంస్కరణలకు మోదీ ముందుకు వస్తారని పేర్కొన్నారు. జనాభా పరంగా దేశంలో అతి పెద్దదైన ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు 2019 నాటి సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌ లాంటివని అందరూ పరిగణించారని వివరించారు. ఈ విజయంతో ఎన్‌డీఏ మరింత పటిష్టంగా తయారైందని, ఈ ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ప్రభావం తప్పక ఉంటుందని పేర్కొన్నారు.

 ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల విశ్వాసం మరింత బలపడిందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఈడీ, సీఈఓ కె. సందీప్‌ నాయక్‌ చెప్పారు. సమీప భవిష్యత్తులో స్టాక్‌ మార్కెట్‌ సానుకూలంగా సాగుతుందని, మార్కెట్‌ కొత్త జీవిత కాల గరిష్ట స్థాయిని తాకుతుందని పేర్కొన్నారు. 2015, మార్చి 4న బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30,025, నిఫ్టీ 9,119 పాయింట్లను తాకాయి. ఇవే ఇప్పటిదాకా ఈ స్టాక్‌ సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు.

నిఫ్టీ బ్రేక్‌ అవుట్‌..
రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన వ్యవస్థాగత ఆర్థిక సంస్కరణల దూకుడును పెంచుతారని ప్రభుదాస్‌ లీలాధర్‌ సీఈఓ అజయ్‌ బోడ్కే వ్యాఖ్యానించారు. ఈ విజయం స్టాక్‌ మార్కెట్‌కు ఉత్తేజాన్నిస్తుందని పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయంతో సంస్కరణలు మరింత వేగాన్ని పుంజుకుంటాయని, అన్ని రంగాల్లో వృద్ధి వెల్లివిరుస్తుందని శామ్‌కో సెక్యూరిటీస్‌ జిమీత్‌ మోడీ పేర్కొన్నారు. ఈ వారంలో నిఫ్టీ కొత్త శిఖరాలకు చేరుతుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ డైరెక్టర్‌ అబ్నిశ్‌ కుమార సుధాంశు చెప్పారు.

ఇక వారం మంగళవారం వెలువడే ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉండనున్నది. రెండు వారాల కన్సాలిడేషన్‌ తర్వాత ఈ మంగళవారం నిఫ్టీ బ్రేక్‌ అవుట్‌ కానున్నదని విశ్లేషకులంటున్నారు. ఆ రోజు 9,119 పాయింట్ల నిఫ్టీ ఇంట్రా డే రికార్డ్‌ బద్దలయ్యే అవకాశాలున్నాయని వారంటున్నారు. జనవరిలో పారిశ్రామికోత్పత్తి 2.7 శాతం పెరగడం కూడా సానుకూల ప్రభావం చూపించనున్నది. ఇక ఈ నెల 16న జరిగే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం కూడా కీలకం కానున్నది.

ర్యాలీ తర్వాత కరెక్షన్‌..: ఈ వారంలో జరిగే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌  సమావేశంలోనే వడ్డీరేట్లు పెంచే అవకాశాలున్నాయన్న అంచనాలు బలం పుంజు కుంటున్నాయని సింఘానియా వ్యాఖ్యానించారు. ఫెడ్‌ రేట్లు పెరిగితే భారత్‌ వంటి వర్ధమాన దేశాలపై ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ర్యాలీ తర్వాత కొంత కరెక్షన్‌ చోటు చేసుకోవచ్చని, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు అంచనాలు బలంగా ఉండడమే దీనికి కారణమని విశ్లేషకులంటున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ విజయాన్ని మార్కెట్‌ అంచనా వేసిందని, ఇది గత శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కనిపించిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ జేమ్స్‌ చెప్పారు. మంగళవారం స్టాక్‌ సూచీలు మంచి జోరునే చూపిస్తాయని, అయితే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌తో సహా పలు దేశాల కేంద్ర బ్యాంక్‌లు తీసుకునే ద్రవ్య విధాన నిర్ణయాలపైననే ఈ జోరు కొనసాగే అవకాశాలు ఆధారపడి ఉన్నాయని వివరించారు. కాగా గత వారంలో బీఎస్‌ఈ సెన్సక్స్‌ 114 పాయింట్లు లాభపడి 28,946 పాయింట్ల వద్ద, ఎన్‌ఎన్‌సీ నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 8,935 పాయింట్ల వద్ద ముగిశాయి.

రూ.10,288 కోట్ల  విదేశీ పెట్టుబడులు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో మన క్యాపిటల్‌ మార్కెట్లో నికరంగా రూ.10,288 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఈ ట్రెండ్‌ మరింతగా కొనసాగుతుందని అంచనాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement