ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడుతుంది: మూడీస్
న్యూఢిల్లీ: ఎన్డీయే విజయంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. దేశీ స్టాక్ మార్కెట్లు, రూపాయిపై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న విశ్వాసం స్థిరంగా కొనసాగేందుకు ఈ విజయం తోడ్పడగలదని తెలిపింది. రాబోయే రోజుల్లో ఎకానమీని పునరుద్ధరించేందుకు విధానపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. భారత వృద్ధి, ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణ గణాంకాలు తక్షణమే మారిపోయే అవకాశాలు లేవని మూడీస్ వివరించింది. ఫలితంగా ఈ ఏడాది భారత వృద్ధి, అసలు సామర్థ్యం కన్నా తక్కువగా సుమారు 5 శాతం మేర ఉండొచ్చని అంచనా వేసింది.
ఎల్ నినో ప్రభావం కారణంగా వ్యవసాయం కూడా అంతంత మాత్రంగా ఉంటే.. వృద్ధి మరింత తగ్గొచ్చని తెలిపింది. రాబోయే రోజుల్లో ఆర్థికంగా విధానపరమైన చర్యలు అమల్లోకి తెచ్చిన దాన్ని బట్టి దేశ ఆర్థిక పరపతి రేటింగ్ మార్పులపై ప్రభావం ఉంటుందని వివరించింది. మధ్యకాలికంగా చూస్తే మాత్రం ..కొత్త ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన చర్యలను ఎంత వేగంగా అమలు చేసిందన్న దాన్ని బట్టి ఎకానమీ పునరుద్ధరణ ఆధారపడి ఉంటుందని మూడీస్ వ్యాఖ్యానించింది. ఒక మోస్తరు క్రెడిట్ రిస్కును సూచిస్తూ స్థిరమైన అంచనాలతో భారత్‌కి మూడీస్ ‘బీఏఏ3’ రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.