
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొత్తగా ప్రత్యక్ష పన్నుల చట్టం రూపకల్పన కోసం ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ.. ఇందుకు మరింత గడువివ్వాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై ఇప్పటిదాకా పురోగతి గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వివరించిన సందర్భంగా.. నివేదిక సమర్పించేందుకు మరో 2–3 నెలల గడువు ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
దాదాపు 50 ఏళ్ల నుంచి అమలవుతున్న ఆదాయ పన్ను చట్ట నిబంధనలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో 2017 నవంబర్‌లో కేంద్రం ఆరుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆరు నెలల వ్యవధిలో 2018 మే 22 నాటికి నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. ఆ తర్వాత ఆగస్టు 22 దాకా పొడిగించింది. అప్పటికీ నివేదిక సిద్ధం కాలేదు. ఈలోగా కమిటీ కన్వీనర్ అరవింద్ మోదీ సెప్టెంబర్ 30న రిటైర్ కావడంతో టాస్క్‌ఫోర్స్ నివేదిక ప్రశ్నార్థకంగా మారింది.