రూ. 1.80 లక్షల కోట్ల రుణాలు లక్ష్యం
ముద్రా బ్యాంక్ సీఈవో జిజి మామెన్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు రూ. 1.80 లక్షల కోట్ల మేర బ్యాంకులు రుణ వితరణ చేయనున్నట్లు లఘు పరిశ్రమల అభివృద్ధి, రీఫైనాన్స్ ఏజెన్సీ ముద్రా సీఈవో జిజి మామెన్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇప్పటిదాకా రూ.25 వేల కోట్లు రుణాల మంజూరీ జరిగినట్లు మంగళవారమిక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులకు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం రూ.1.22 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. అంచనాలు మించి 3.48 కోట్ల మందికి రూ. 1.33 లక్షల కోట్ల రుణ వితరణ జరిగినట్లు మామెన్ చెప్పారు.
ఇందులో రూ.80 వేల కోట్ల పైగా రుణా లు బ్యాంకులు ఇవ్వగా, మిగతావి మైక్రోఫైనాన్స్ సంస్థలు మొదలైనవి ఇచ్చాయని ఆయన తెలియజేశారు. రుణాలు తీసుకున్న వారిలో సింహభాగం మహిళలే ఉండగా, 36 శాతం సంస్థలు కొత్తగా ఏర్పాైటె నవని మామెన్ చెప్పారు. మరోవైపు, పౌల్ట్రీ, డెయిరీ వంటి వ్యవసాయ రంగ అనుబంధ సంస్థలను కూడా ముద్రా యోజన పరిధిలోకి తేవడంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారాయన. రుణ సదుపాయం పొందగోరే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పడేందుకు ప్రత్యేక పోర్టల్ కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.