ముద్రా ద్వారా రూ. 42,520 కోట్ల రుణాలు: మోదీ
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారాల కోసం ఉద్దేశించిన ముద్రా యోజన కింద ఇప్పటివరకూ 66 లక్షలకుపైగా రుణ గ్రహీతలకు దాదాపు రూ.42,520 కోట్లు పంపిణీ చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. వీరిలో 33 శాతం మహిళలని ఆయన తెలిపారు. సొంతంగా ఉపాధి, ఆర్జన, సాధికారత (3ఈ- ఎంటర్‌ప్రైస్, ఎర్నింగ్, ఎంపవర్‌మెంట్) ప్రధాన లక్ష్యాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రుణాలు పొందినవారిలో 23.50 లక్షల మంది మహిళలు ఉన్నారు.
5.75 కోట్ల మంది స్వయం ఉపాధి సాధించాలని, దీనికి అనుగుణంగా 12 కోట్ల మందికి ఉపాధి లభించాలన్నది ముద్రా ఆకాంక్ష. ఇందుకు దాదాపు రూ.11 లక్షల కోట్ల నిధిని సమకూర్చాలన్నది కేంద్రం ఉద్దేశం. 2015-16 బడ్జెట్‌లో ముద్రా రుణాల కింద 1.22 లక్షల కోట్ల పంపిణీ జరపాలన్నది బ్యాంకింగ్ రంగ లక్ష్యంగా ఉంది.