న్యూఢిల్లీ: ముద్రా పథకం కింద 12 కోట్ల మంది లబ్ధి దారులకు సుమారు రూ.6 లక్షల కోట్ల మేర రుణాలను అందజేయడం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వం చిన్న వ్యాపారులకు చేసిందేమీ లేదని, తాము గత ప్రభుత్వం మాదిరిగా రుణ మేళాలు నిర్వహించకుండా, అర్హులకే రుణాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) పథకం ప్రజలు తమ కలలు నెరవేర్చుకునేందుకు సాయపడిందని, చిన్న వ్యాపార సంస్థల స్థాపన ద్వారా ఉపాధి కల్పనకు తోడ్పడినట్టు ప్రధాని వివరించారు.
పీఎంవైవై కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2015 ఏప్రిల్ 8న ప్రారంభించారు. కార్పొరేట్ రంగానికి కాకుండా, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ సంస్థలకు ఒక్కో దానికి రూ.10 లక్షల వరకు రుణ సాయం అందజేయడం కార్యక్రమ ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా ఈ పథకం లబ్ధిదారులను ఉద్దేశించి ప్రధాని మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘25–30 ఏళ్ల క్రితం రాజకీయ ప్రయోజనాల కోసం రుణ మేళాలు నిర్వహించేవారు.
రాజకీయ నాయకులకు సన్నిహితులైన వారికే రుణాలు లభించేవి’’ అని మోదీ పేర్కొన్నారు. కానీ ఎన్డీయే సర్కారు మాత్రం ఎటువంటి రుణ మేళాలు నిర్వహించలేదని, దళారులకు చోటివ్వలేదని చెప్పారు. పేదవారు, చిన్న వ్యాపారులు బ్యాంకుల వద్ద ఎలాంటి హామీ లేకుండానే రుణాలు పొందేలా ముద్రాను రూపొందించినట్టు చెప్పారు.
9 కోట్ల మంది మహిళలే...
ముద్రా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించిందని, దాంతో ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. 12 కోట్ల మందికి రూ.6 లక్షల కోట్ల రుణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఈ 12 కోట్ల మందిలో 28 శాతం మంది మొదటి సారి వ్యాపారవేత్తలేనని తెలిపారు. ఇక 74 శాతం మంది (9 కోట్ల మంది) మహిళలు ఉండగా, మొత్తం లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 55 శాతం వరకు ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment