mudra
-
పట్టభద్రులకు ప్రత్యేక ముద్ర
సిరిసిల్ల/కోరుట్ల:కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ‘ముద్ర’ లోన్ వృత్తి విద్యాకోర్సుల్లో పట్టభద్రులైన నిరుద్యోగులకు వరం. ఈ పథకం కింద సొంతంగా వ్యాపారం మొదలు పెట్టడానికి ఆర్బీఐ గుర్తించిన 27 బ్యాంకుల ద్వారా రుణసాయం అందుతుంది. ఇందుకు బిజినెస్ ప్లాన్ కీలకం. ఈ రుణాల్లో ఎలాంటి సబ్సిడీ ఉండదు. రుణం తీసుకునే బ్యాంకులను బట్టి వడ్డీ రేటు ఉంటుంది. ఎవరికి ఇస్తారు: భారత పౌరసత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ ముద్ర రుణసాయం అందించవచ్చు. 18 నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ముద్ర రుణాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా, సంస్థాపరంగా రుణాలు తీసుకునే అవకాశం ఉంది. ముద్ర రుణాలు.. మూడు రకాలు: ముద్ర రుణాల్లో మూడు రకాలు ఉన్నాయి. బిజినెస్ ప్లాన్ వాటికి అవసరమైన రుణసాయం ఆధారంగా వీటిని విభజించారు. శిశు ముద్ర లోన్ కింద కేవలం రూ.50 వేల రుణసాయం మాత్రమే అందిస్తారు. చిన్నపాటి వ్యాపారాలకు ఈ రుణ సాయం పనికొస్తుంది. కిషోర ముద్రలోన్ కింద రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇస్తారు. తరుణ ముద్ర లోన్ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు రుణం అందిస్తారు. ఎక్కడ సంప్రదించాలి: ఆర్బీఐ ముద్ర రుణాలు ఇవ్వడానికి గుర్తించిన 27 బ్యాంకుల్లో మనకు అందుబాటులో ఉన్న ఏ బ్యాంకులోనైనా ముద్ర రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఇలా దరఖాస్తు చేయాలి..: ముద్ర రుణసాయం దరఖాస్తులు ఆన్లైన్లో దొరుకుతాయి. దరఖాస్తులో ఉన్న పూర్తి వివరాలు నింపి బ్యాంకును సంప్రదించాలి. దరఖాస్తుతోపాటు ఐడెంటిటీ కార్డు, రెసిడెన్స్ ప్రూఫ్, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసి కెటగిరీని తెలిపే ధ్రువీకరణ పత్రాలు,మైనార్టీలు, బిజినెస్ ప్లాన్ వివరాలు, బిజినెస్ కోసం కొనుగోలు చేసే మిషనరీల వివరాలు, ఏ సంస్థ నుంచి మిషనరీలు కొనుగోలు చేస్తున్నామన్న సమాచారం. బిజినెస్‌కు చెందిన లైసెన్స్‌తో దరఖాస్తు చేయాలి. ముఖ్యంగా మనం ఏర్పాటు చేసే బిజినెస్ ఆదాయ వ్యయాలు, లాభాలు వంటి అంశాలను బ్యాంకర్లకు స్పష్టంగా చూపాలి. రుణం చెల్లింపు ఎలా..: రుణం అందించిన బ్యాంకు వడ్డీ రేటు ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మనం బ్యాంకు వారికి సమర్పించే బిజినెస్ ప్లాన్‌ను పరిశీలించిన తరువాత బ్యాంకు అధికారులే మనకు వచ్చే ఖర్చులు..ఆదాయం వంటి వివరాలు ఆధారంగా రుణం చెల్లింపుకు కాల వ్యవధిని నిర్ణయిస్తారు. ఫర్టిలైజర్ షాపులకు.. ♦ గ్రామాల్లో, పట్టణాల్లో ఫర్టిలైజర్ షాపులు పెట్టుకుని నిరుద్యోగులు ఉపాధి పొందాలంటే లైసెన్స్ ప్రక్రియ ప్రధానమైంది. ఇందుకోసం.. ♦ డిగ్రీలో కెమిస్ట్రీ(రసాయన శాస్త్రం)చదివి ఉండాలి. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ♦ ఏ కంపెనీ స్టాక్ అమ్ముతారో, ఆ కంపెనీ నుంచి గుర్తింపు ఉండాలి. ♦ నివాస ధ్రువీకరణ పత్రం ఉండాలి. ♦ రూ.2500 వ్యవసాయశాఖ పేరిట చలానా తీయాల్సి ఉంటుంది. ♦ అధార్ కార్డు ఉండాలి. ♦ ఎక్కడ దుకాణం పెడతారో దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం ఉండాలి. -
అండగా ఉంటాడనుకుంటే..అందరినీ వదిలి వెళ్లాడు!
కన్నీరుమున్నీరవుతున్న మౌలాలి తల్లిదండ్రులు నేడు గ్రామానికి చేరనున్న మృతదేహం తీవ్ర వర్షాభావంతో వ్యవసాయం అప్పులు మిగిల్చింది. ఉన్న ఊళ్లో ఉపాధి కరువైంది. కుటుంబపోషణ భారమైంది. పిల్లల చదువులు భారమయ్యాయి. కూతురు పెళ్లికి చేసిన అప్పు కొండలా పెరిగిపోతోంది. ఇక చేసేది లేక పెద్ద కుమారుడిని కువైట్‌కు పంపారు. అతడు పంపే డబ్బుతో అప్పులు తీర్చుకుంటూ చిన్న కుమారిడిని చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండగా విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదం కుమారుడిని పొట్టన పెట్టుకుంది. దేశం కాని దేశంలో కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు విలవిలలాడారు. కుమారుడి కడచూపు కోసం వారు నిద్రహారాలు మాని ఎదురుచూస్తున్నారు. ఎన్పీకుంట : కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటానంటూ వెళ్లిన కుమారుడు శవమై వస్తుండటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మండలకేంద్రానికి చెందిన హసనాపురం బాషా కుమారుడు హెచ్.మౌలాలి(24) కుటుంబపోషణ కోసం కువైట్‌కు వెళ్లి శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మండలకేంద్రంలోని పశువుల మంద వీధిలో నివాసముంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న బాషాకు అప్పులు ఎక్కువయ్యాయి. అప్పు చేసి కూతురి వివాహం చేశారు. పిల్లల చదువులు భారమయ్యాయి. దీంతో పెద్ద కుమారుడు మౌలాలిని కువైట్‌కు పంపారు. అతడు సంపాందించి పంపిన డబ్బుతో అప్పులు తీర్చుకుంటూ చిన్న కుమారుడు తాజ్‌ను చదివిస్తున్నారు. అన్నీ సర్దుకుంటాయిలే అనుకునే సమయంలోనే పిడుగులాంటి వార్త రావడంతో బాషా కుటుంబం కుదేలైంది. రోడ్డు ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన వారి అల్లుడు చాంద్‌బాషాకు ఆదాన్ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. కాగా మౌలాలి మృతదేహం సోమవారం అర్ధరాత్రికి కువైట్ నుంచి హైదరాబాద్‌కు రానున్నట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రానికి ఇంటికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధవులు తెలిపారు. -
చేనేతకు ముద్ర రుణాలు
–తెలంగాణ చేనేత, జౌళీశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాంగోపాల్‌రావు భూదాన్‌పోచంపల్లి : అర్హత కలిగిన చేనేత కార్మికులందరికీ ముద్ర పథకం కింద రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకోసం ఈ నెల 29న హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు చేనేత కాంప్లెక్స్‌లో ముద్ర లోన్స్ మేళా ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళిశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. రాంగోపాల్‌రావు తెలిపారు. గురువారం మండల కేంద్రంలో పోచంపల్లి టై అండ్ డై సిల్క్ చీరెల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర, ప్రభుత్వాలు అమలు చేస్తున్న చేనేత పథకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముద్ర పథకంలో భాగంగా ఎలాంటి ష్యూరిటీ అవసరం లేకుండా శిశు విభాగంలో రూ.50వేలు, కిషోర్ కింద రూ. 5లక్షలు, తరుణ్ కింద రూ. 20లక్షల వరకు రుణాలు ఇప్పిస్తుందని తెలిపారు. నల్లగొండ జిల్లాలో 3 వేల మందికి రుణాలు ఇప్పించాలని లక్ష్యంగా నిర్ణయించారని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను పెంచడానికి త్వరలో టెక్స్టైల్ పాలసీని ప్రకటించనుందని వెల్లడించారు. ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్‌లో స్థానం సంపాదించాలి : హిమజకుమార్ ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్‌లో స్థానం సంపాదించుకుంటే ప్రభుత్వ పరంగా, మార్కెటింగ్ పరంగా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని, చేనేత కార్మికులు ఆ దిశగా కృషి చేయాలని వీవర్స్ సర్వీస్‌సెంటర్ అసిస్టెంట్ డైరక్టర్ వి. హిమజకుమార్ పేర్కొన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌కు ఈ అవకాశం లభించిందన్నారు. జాతీయ, సంత్‌కబీర్ అవార్డులతో పాటు ఢిల్లీ హట్, జనపత్మేళా, క్రాప్ట్మేళా, ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేతను ప్రొత్సహిస్తుందని తెలిపారు. ప్యారిస్‌లో నిర్వహించే హ్యాండ్లూమ్ మేళాకు జాతీయ అవార్డులు పొందిన పుట్టపాకకు చెందిన పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి, కొలను బుచ్చిరాములతో పాటు పోచంపల్లి, కొయ్యలగూడెం సంఘాల ప్రతిని«ధులను పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్మికుల వృత్తి నైపుణ్యాలను మెర్గు పరిచేందుకు వీవింగ్, డైయింగ్‌లో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. టై అండ్ డై అసోసియేషన్ అ«ధ్యక్షుడు తడక రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీవర్స్ సర్వీస్‌సెంటర్ టెక్నికల్ సూపరింటెండెంట్ టి. సత్యనారాయణరెడ్డి, క్వాలిటీ అస్సెస్మెంట్ అధికారి శేషగిరిరావు, కొంగరి భాస్కర్, తడక వెంకటేశం, సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, హ్యాండ్లూమ్ పార్క్ చైర్మన్ కడవేరు దేవేందర్, అర్భన్‌బ్యాంకు చైర్మన్ చిట్టిపోలు శ్రీనివాస్, అసోషియేషన్ ఉపాధ్యక్షుడు సంగెం చంద్రయ్య, కార్యదర్శి భారత లవకుమార్, సుంకి భాస్కర్, గుండేటి శ్రవన్, బోగ విష్ణు, గుండు శ్రీరాములు, వనం శంకర్, వినోద్, కుడికాల నర్సింహ, పెండెం రఘు తదితరులు పాల్గొన్నారు. -
రూ.6 వేల కోట్ల ‘ముద్ర’ రుణాలు
చిరు వ్యాపారులకు అందించే లక్ష్యం: కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: చిరు వ్యాపారుల రుణాల మంజూరులో కేంద్రం తనదైన ‘ముద్ర’ వేసేందుకు నడుంబిగించింది. ఈ పథకం ద్వారా 2016-17 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోనే రూ.6వేల కోట్ల రుణాలు అందించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివా రం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహంలో ముద్ర యోజన పథకం పని తీరుపై వివిధ బ్యాంకు అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఏపీలో చోటుచేసుకున్న కాల్‌మనీ వంటి ఘటనలు పునారావృతం కాకుండా వీధివ్యాపారులకు అండగాఉండి ముద్ర యోజన ద్వారా రుణాలిప్పిస్తున్నట్లు చె ప్పారు.తెలంగాణలో గతేడాది రూ.4,557 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా బ్యాంకులు దాదాపు 4లక్షల మందికి రూ.3,877 కోట్లు అందజేశాయన్నారు. ఈసారి కచ్చితంగా రూ.6వేల కోట్లకుపైగా రుణాలు అందేలా చూస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక మెగా రుణమేళాను నిర్వహిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలన్నారు. రెండు రాష్ట్రాలు ముందుకొస్తే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో సమావేశం ఏర్పాటు చేయిస్తానన్నారు. -
ముద్రా ద్వారా రూ. 42,520 కోట్ల రుణాలు: మోదీ
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారాల కోసం ఉద్దేశించిన ముద్రా యోజన కింద ఇప్పటివరకూ 66 లక్షలకుపైగా రుణ గ్రహీతలకు దాదాపు రూ.42,520 కోట్లు పంపిణీ చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. వీరిలో 33 శాతం మహిళలని ఆయన తెలిపారు. సొంతంగా ఉపాధి, ఆర్జన, సాధికారత (3ఈ- ఎంటర్ప్రైస్, ఎర్నింగ్, ఎంపవర్మెంట్) ప్రధాన లక్ష్యాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రుణాలు పొందినవారిలో 23.50 లక్షల మంది మహిళలు ఉన్నారు. 5.75 కోట్ల మంది స్వయం ఉపాధి సాధించాలని, దీనికి అనుగుణంగా 12 కోట్ల మందికి ఉపాధి లభించాలన్నది ముద్రా ఆకాంక్ష. ఇందుకు దాదాపు రూ.11 లక్షల కోట్ల నిధిని సమకూర్చాలన్నది కేంద్రం ఉద్దేశం. 2015-16 బడ్జెట్లో ముద్రా రుణాల కింద 1.22 లక్షల కోట్ల పంపిణీ జరపాలన్నది బ్యాంకింగ్ రంగ లక్ష్యంగా ఉంది. -
ఆంధ్రా బ్యాంక్ ‘ముద్రా’ కార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారస్తుల కోసం ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ ‘ముద్రా’ పేరుతో రూపే డెబిట్‌కార్డులను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్రాలోన్స్‌లో భాగంగా ఎటువంటి క్రెడిట్ గ్యారంటీ లేకుండానే రూ. 10 లక్షలోపు రుణాలను బ్యాంకులు మంజూరు చేయనున్నాయి. ఇలా మంజూరైన రుణాలను వారి అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడానికి డెబిట్ కార్డుల రూపంలో అందిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈవో ఎస్.కె.కల్రా తెలిపారు. రూ. 50 వేలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు విభాగాల్లో మొత్తం మూడు రకాల కార్డులను జారీ చేస్తున్నట్లు తెలిపారు. చిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారాలకు పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేయడానికి కేంద్రం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఈ ఏడాది ప్రభుత్వరంగ బ్యాంకులు కనీసం రూ. 70,000 కోట్ల విలువైన చిన్న మధ్యస్థాయి రంగాలకు రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక సలహాదారు సుబ్బారావు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు వారీ లక్ష్యాలను విడుదల చేయనున్నట్లు చెపాప్రాఉ. అంతక్రితం జరిగిన కార్యక్రమంలో ముద్రా కార్డును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గతేడాది ఆంధ్రాబ్యాంక్ ఈ విభాగంలో రూ. 700 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసిందని, ఈ ఏడాది రూ. 1,600 కోట్లు మంజూరు చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించవచ్చని అంచనా వేస్తున్నట్లు కల్రా తెలిపారు.