చేనేతకు ముద్ర రుణాలు
–తెలంగాణ చేనేత, జౌళీశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాంగోపాల్‌రావు
భూదాన్‌పోచంపల్లి : అర్హత కలిగిన చేనేత కార్మికులందరికీ ముద్ర పథకం కింద రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకోసం ఈ నెల 29న హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు చేనేత కాంప్లెక్స్‌లో ముద్ర లోన్స్ మేళా ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళిశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. రాంగోపాల్‌రావు తెలిపారు. గురువారం మండల కేంద్రంలో పోచంపల్లి టై అండ్ డై సిల్క్ చీరెల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర, ప్రభుత్వాలు అమలు చేస్తున్న చేనేత పథకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముద్ర పథకంలో భాగంగా ఎలాంటి ష్యూరిటీ అవసరం లేకుండా శిశు విభాగంలో రూ.50వేలు, కిషోర్ కింద రూ. 5లక్షలు, తరుణ్ కింద రూ. 20లక్షల వరకు రుణాలు ఇప్పిస్తుందని తెలిపారు. నల్లగొండ జిల్లాలో 3 వేల మందికి రుణాలు ఇప్పించాలని లక్ష్యంగా నిర్ణయించారని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను పెంచడానికి త్వరలో టెక్స్‌టైల్ పాలసీని ప్రకటించనుందని వెల్లడించారు.
ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్‌లో స్థానం సంపాదించాలి : హిమజకుమార్
ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్‌లో స్థానం సంపాదించుకుంటే ప్రభుత్వ పరంగా, మార్కెటింగ్ పరంగా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని, చేనేత కార్మికులు ఆ దిశగా కృషి చేయాలని వీవర్స్ సర్వీస్‌సెంటర్ అసిస్టెంట్ డైరక్టర్ వి. హిమజకుమార్ పేర్కొన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌కు ఈ అవకాశం లభించిందన్నారు. జాతీయ, సంత్‌కబీర్ అవార్డులతో పాటు ఢిల్లీ హట్, జనపత్‌మేళా, క్రాప్ట్‌మేళా, ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్‌ల ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేతను ప్రొత్సహిస్తుందని తెలిపారు. ప్యారిస్‌లో నిర్వహించే హ్యాండ్లూమ్ మేళాకు జాతీయ అవార్డులు పొందిన పుట్టపాకకు చెందిన పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి, కొలను బుచ్చిరాములతో పాటు పోచంపల్లి, కొయ్యలగూడెం సంఘాల ప్రతిని«ధులను పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్మికుల వృత్తి నైపుణ్యాలను మెర్గు పరిచేందుకు వీవింగ్, డైయింగ్‌లో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. టై అండ్ డై అసోసియేషన్ అ«ధ్యక్షుడు తడక రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీవర్స్ సర్వీస్‌సెంటర్ టెక్నికల్ సూపరింటెండెంట్ టి. సత్యనారాయణరెడ్డి, క్వాలిటీ అస్సెస్‌మెంట్ అధికారి శేషగిరిరావు, కొంగరి భాస్కర్, తడక వెంకటేశం, సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, హ్యాండ్లూమ్ పార్క్ చైర్మన్ కడవేరు దేవేందర్, అర్భన్‌బ్యాంకు చైర్మన్ చిట్టిపోలు శ్రీనివాస్, అసోషియేషన్ ఉపాధ్యక్షుడు సంగెం చంద్రయ్య, కార్యదర్శి భారత లవకుమార్, సుంకి భాస్కర్, గుండేటి శ్రవన్, బోగ విష్ణు, గుండు శ్రీరాములు, వనం శంకర్, వినోద్, కుడికాల నర్సింహ, పెండెం రఘు తదితరులు పాల్గొన్నారు.