రూ.6 వేల కోట్ల ‘ముద్ర’ రుణాలు
చిరు వ్యాపారులకు అందించే లక్ష్యం: కేంద్ర మంత్రి దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: చిరు వ్యాపారుల రుణాల మంజూరులో కేంద్రం తనదైన ‘ముద్ర’ వేసేందుకు నడుంబిగించింది. ఈ పథకం ద్వారా 2016-17 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోనే రూ.6వేల కోట్ల రుణాలు అందించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివా రం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహంలో ముద్ర యోజన పథకం పని తీరుపై వివిధ బ్యాంకు అధికారులతో సమీక్షించారు.
ఆయన మాట్లాడుతూ ఏపీలో చోటుచేసుకున్న కాల్‌మనీ వంటి ఘటనలు పునారావృతం కాకుండా వీధివ్యాపారులకు అండగాఉండి ముద్ర యోజన ద్వారా రుణాలిప్పిస్తున్నట్లు చె ప్పారు.తెలంగాణలో గతేడాది రూ.4,557 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా బ్యాంకులు దాదాపు 4లక్షల మందికి రూ.3,877 కోట్లు అందజేశాయన్నారు. ఈసారి కచ్చితంగా రూ.6వేల కోట్లకుపైగా రుణాలు అందేలా చూస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక మెగా రుణమేళాను నిర్వహిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలన్నారు. రెండు రాష్ట్రాలు ముందుకొస్తే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో సమావేశం ఏర్పాటు చేయిస్తానన్నారు.