పట్టభద్రులకు ప్రత్యేక ముద్ర | PM Modi Mudra Loans For startups | Sakshi
Sakshi News home page

పట్టభద్రులకు ప్రత్యేక ముద్ర

Published Sun, Mar 11 2018 11:44 AM | Last Updated on Sun, Mar 11 2018 11:44 AM

PM Modi Mudra Loans For startups - Sakshi

సిరిసిల్ల/కోరుట్ల:కేంద్ర ప్రభుత్వం  2016 నుంచి అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ‘ముద్ర’  లోన్‌ వృత్తి విద్యాకోర్సుల్లో పట్టభద్రులైన నిరుద్యోగులకు వరం. ఈ పథకం కింద సొంతంగా వ్యాపారం మొదలు పెట్టడానికి ఆర్‌బీఐ గుర్తించిన 27 బ్యాంకుల ద్వారా రుణసాయం అందుతుంది. ఇందుకు బిజినెస్‌ ప్లాన్‌ కీలకం. ఈ రుణాల్లో ఎలాంటి సబ్సిడీ ఉండదు. రుణం తీసుకునే బ్యాంకులను బట్టి వడ్డీ రేటు ఉంటుంది.

ఎవరికి ఇస్తారు: భారత పౌరసత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ ముద్ర రుణసాయం అందించవచ్చు. 18 నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ముద్ర రుణాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా, సంస్థాపరంగా రుణాలు తీసుకునే అవకాశం ఉంది.

ముద్ర రుణాలు.. మూడు రకాలు: ముద్ర రుణాల్లో మూడు రకాలు ఉన్నాయి. బిజినెస్‌ ప్లాన్‌ వాటికి అవసరమైన రుణసాయం ఆధారంగా వీటిని విభజించారు. శిశు ముద్ర లోన్‌ కింద కేవలం రూ.50 వేల రుణసాయం మాత్రమే అందిస్తారు. చిన్నపాటి వ్యాపారాలకు ఈ రుణ సాయం పనికొస్తుంది. కిషోర ముద్రలోన్‌ కింద రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇస్తారు. తరుణ ముద్ర లోన్‌ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు రుణం అందిస్తారు.

ఎక్కడ సంప్రదించాలి: ఆర్‌బీఐ ముద్ర రుణాలు ఇవ్వడానికి గుర్తించిన 27 బ్యాంకుల్లో మనకు అందుబాటులో ఉన్న ఏ బ్యాంకులోనైనా ముద్ర రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు.

ఇలా దరఖాస్తు చేయాలి..: ముద్ర రుణసాయం దరఖాస్తులు ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. దరఖాస్తులో ఉన్న పూర్తి వివరాలు నింపి బ్యాంకును సంప్రదించాలి. దరఖాస్తుతోపాటు ఐడెంటిటీ కార్డు, రెసిడెన్స్‌ ప్రూఫ్, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసి కెటగిరీని తెలిపే ధ్రువీకరణ పత్రాలు,మైనార్టీలు, బిజినెస్‌ ప్లాన్‌ వివరాలు, బిజినెస్‌ కోసం కొనుగోలు చేసే మిషనరీల వివరాలు, ఏ సంస్థ నుంచి మిషనరీలు కొనుగోలు చేస్తున్నామన్న సమాచారం. బిజినెస్‌కు చెందిన లైసెన్స్‌తో దరఖాస్తు చేయాలి. ముఖ్యంగా మనం ఏర్పాటు చేసే బిజినెస్‌ ఆదాయ వ్యయాలు, లాభాలు వంటి అంశాలను బ్యాంకర్లకు స్పష్టంగా చూపాలి.

రుణం చెల్లింపు ఎలా..: రుణం అందించిన బ్యాంకు వడ్డీ రేటు ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మనం బ్యాంకు వారికి సమర్పించే బిజినెస్‌ ప్లాన్‌ను పరిశీలించిన తరువాత బ్యాంకు అధికారులే మనకు వచ్చే ఖర్చులు..ఆదాయం వంటి వివరాలు ఆధారంగా రుణం చెల్లింపుకు కాల వ్యవధిని నిర్ణయిస్తారు.

ఫర్టిలైజర్‌ షాపులకు..
గ్రామాల్లో, పట్టణాల్లో ఫర్టిలైజర్‌ షాపులు పెట్టుకుని నిరుద్యోగులు ఉపాధి పొందాలంటే లైసెన్స్‌ ప్రక్రియ ప్రధానమైంది. ఇందుకోసం..
డిగ్రీలో కెమిస్ట్రీ(రసాయన శాస్త్రం)చదివి ఉండాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఏ కంపెనీ స్టాక్‌ అమ్ముతారో, ఆ కంపెనీ నుంచి గుర్తింపు ఉండాలి.
నివాస ధ్రువీకరణ పత్రం ఉండాలి.
రూ.2500 వ్యవసాయశాఖ పేరిట చలానా తీయాల్సి ఉంటుంది.
అధార్‌ కార్డు ఉండాలి.
ఎక్కడ దుకాణం పెడతారో దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం ఉండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement