ఆంధ్రా బ్యాంక్ ‘ముద్రా’ కార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారస్తుల కోసం ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ ‘ముద్రా’ పేరుతో రూపే డెబిట్‌కార్డులను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్రాలోన్స్‌లో భాగంగా ఎటువంటి క్రెడిట్ గ్యారంటీ లేకుండానే రూ. 10 లక్షలోపు రుణాలను బ్యాంకులు మంజూరు చేయనున్నాయి. ఇలా మంజూరైన రుణాలను వారి అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడానికి డెబిట్ కార్డుల రూపంలో అందిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈవో ఎస్.కె.కల్రా తెలిపారు. రూ. 50 వేలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు విభాగాల్లో మొత్తం మూడు రకాల కార్డులను జారీ చేస్తున్నట్లు తెలిపారు.
చిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారాలకు పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేయడానికి కేంద్రం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఈ ఏడాది ప్రభుత్వరంగ బ్యాంకులు కనీసం రూ. 70,000 కోట్ల విలువైన చిన్న మధ్యస్థాయి రంగాలకు రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక సలహాదారు సుబ్బారావు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు వారీ లక్ష్యాలను విడుదల చేయనున్నట్లు చెపాప్రాఉ. అంతక్రితం జరిగిన కార్యక్రమంలో ముద్రా కార్డును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గతేడాది ఆంధ్రాబ్యాంక్ ఈ విభాగంలో రూ. 700 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసిందని, ఈ ఏడాది రూ. 1,600 కోట్లు మంజూరు చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించవచ్చని అంచనా వేస్తున్నట్లు కల్రా తెలిపారు.