న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సంపన్నుడిగా వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా 12వ ఏడాదీ అగ్రస్థానంలో నిల్చారు. టెలికం వెంచర్ జియో కార్యకలాపాలు గణనీయంగా విస్తరించిన నేపథ్యంలో ఆయన సంపద మరో 4.1 బిలియన్ డాలర్లు పెరిగి 51.4 బిలియన్ డాలర్లకు చేరింది. 2019కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ఈ మేరకు భారత్‌లో సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ .. ఎనిమిదో స్థానం నుంచి ఏకంగా రెండో స్థానానికి చేరారు.
ఆయన సంపద విలువ 15.7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఫోర్బ్స్ లెక్కగట్టింది. అదానీ గ్రూప్.. ఎయిర్‌పోర్టులు మొదలుకుని డేటా సెంటర్ల దాకా వివిధ వ్యాపార విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరించడం ఆయనకు కలిసివచ్చింది. 15.6 బిలియన్ డాలర్ల సంపదతో హిందుజా సోదరులు మూడో స్థానంలో ఉన్నారు. ఎకానమీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫోర్బ్స్ ఇండియా కుబేరుల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 2019లో 8 శాతం క్షీణించి 452 బిలియన్ డాలర్లకు తగ్గింది. టాప్ 100 సంపన్నుల్లో సగం మంది నికర సంపద గణనీయంగా తగ్గింది.
► ఈసారి కనీసం 1.4 బిలియన్ డాలర్ల సంపద ఉన్న వారిని ఫోర్బ్స్ సంపన్నుల లిస్టులో చేర్చింది. గతేడాది ఇది 1.48 బిలియన్ డాలర్లు.
►2019 జాబితాలో ఆరుగురు కొత్తగా చోటు సాధించారు. అల్కెమ్ ల్యాబరేటరీస్‌కి చెందిన సింగ్ కుటుంబం, బైజు రవీంద్రన్ (బైజూస్), మహేంద్ర ప్రసాద్ (అరిస్టో ఫార్మా), మనోహర్ లాల్.. మధుసూదన్ అగర్వాల్ (హల్దీరామ్ స్నాక్స్), రాజేష్ మెహ్రా (జాక్వార్), సందీప్ ఇంజినీర్ (ఆస్ట్రల్ పాలీ టెక్నిక్) వీరిలో ఉన్నారు.
పన్ను చెల్లించే కోటీశ్వరుల్లో 20 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: పన్ను చెల్లించే ఆదాయం రూ.కోటికిపైగా కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్య 2018–19లో 20 శాతం పెరిగి 97,689కు చేరుకుంది. 2017–18లో వీరి సంఖ్య 81,344గానే ఉండేది. కార్పొరేట్, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), వ్యక్తుల గణాంకాలనూ కూడా కలిపి చూస్తే పన్ను వర్తించే ఆదాయం రూ.కోటిపైన ఉన్న రిటర్నుల సంఖ్య 2018–19లో 1.67 లక్షలకు చేరింది. 19 శాతం పెరిగింది.
ఫోర్బ్స్ కుబేరుడు మళ్లీ అంబానీయే
Published Sat, Oct 12 2019 3:18 AM | Last Updated on Sat, Oct 12 2019 3:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment