
ముంబై : పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ చైనాలో అలీబాబా తరహాలో భారత్‌లో ఈకామర్స్ దిగ్గజ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ మార్కెట్‌లో కీలక వాటా దక్కించుకోవాలన్న తన కలను పండించుకునేందుకు రూ 1.73 లక్షల కోట్లతో పూర్తి యాజమాన్య హక్కులతో సబ్సిడరీని ఏర్పాటు చేస్తున్నారు. రూ 65,000 కోట్లతో ఏర్పడే హోల్డింగ్ కంపెనీకి రిలయన్స్ జియోలో కంపెనీకి ఉన్న రూ 65,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడిని తరలిస్తారు. మరోవైపు జియో రుణాలన్నింటినీ మాతృసంస్థకు తరలిస్తారు. దీంతో 2020 మార్చి నాటికి జియో పూర్తిగా రుణ రహిత కంపెనీగా ఎదుగుతుంది. మరోవైపు ముఖేష్ ఈకామర్స్ ప్రణాళికలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) బోర్డు గ్రీన్‌సిగ్నల్ లభించింది.
చమురు పెట్రోకెమికల్ గ్రూప్‌తో లాభాల వేటలో ముందున్న ఆర్‌ఐఎల్‌ను రానున్న రోజుల్లో వృద్ధి బాటన పరుగులు పెట్టించేందుకు డేటా, డిజిటల్ సర్వీసులపై ముఖేష్ అంబానీ దృష్టిసారించారు. అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లతో తలపడేందుకు భారీ పెట్టుబడులతో ఈకామర్స్ ఫ్లాట్‌ఫాం ముఖేష్ అడుగుపెడుతుండటంతో ఈ-మార్కెట్‌లో రసవత్తర పోరుకు తెరలేవనుంది. రిలయన్స్ రాబడుల్లో ప్రస్తుతం 32 శాతంగా ఉన్న రిటైల్ సహా నూతన వ్యాపారాలు రానున్న కొన్నేళ్లలో దాదాపు సగానికి పెరుగుతాయని ఆగస్ట్‌లో వాటాదారుల సమావేశంలో ముఖేష్ అంబానీ పేర్కొనడం గమనార్హం. ఈకామర్స్ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లేందుకు కొన్ని సంస్థల్లో వాటా కొనుగోళ్లు, స్వాధీనాలపైనా ముఖేష్ కసరత్తు సాగిస్తున్నారు. ఈకామర్స్ ప్రణాళికల దిశగా వ్యూహాత్మక భాగస్వాములు ఆసక్తి కనబరిచారని ముఖేష్ అంబానీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment