
న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీ.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. గ్యాస్ బిజినెస్‌ల నుంచి టెలికాం వ్యాపారాల వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఈ అధినేత కార్పొరేట్ ఇండస్ట్రీసి ఏలుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా 10వ ఏడాది దేశంలో అత్యంత ధనికవంతుడుగా ముఖేష్ అంబానీనే మళ్లీ టాప్‌లో నిలిచారు. 38 బిలియన్ డాలర్ల సంపదతో అంటే దాదాపు రూ. 2,47,541 కోట్లకు పైగా సంపదతో ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో ముఖేష్ తన స్థానాన్ని నిలుపుకున్నారు. ఈ ఏడాది ఆయన తన నికర సంపదను 15.3 బిలియన్ డాలర్లను పెంచుకున్నారు.
భారత్‌లోనే కాక, ఆసియాలోనూ టాప్-5 ధనికుల్లో ముఖేష్ అంబానీ ఒకరిగా నిలిచారు. రిఫైనింగ్ మార్జిన్లను మెరుగుపరుచుకోవడం, రిలయన్స్ జియో టెలికాం మార్కెట్‌లో విజయవంతం కావడం ముఖేష్ సంపదలు పెరగడానికి దోహదం చేసింది. 2016లో జియో లాంచ్ అయినప్పటి నుంచి 130 మిలియన్ సబ్‌స్క్రైబర్లను ఇది తన సొంతం చేసుకుంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా భారీగా పైకి ఎగిశాయి. ఈ జాబితాలో మరో అతిపెద్ద గెయినర్‌గా విప్రో అజిమ్ ప్రేమ్‌జీ ఉన్నారు. 19 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన రెండో స్థానానికి ఎగబాకారు.