
గవర్నెన్స్ లోపించడంపైనే ఆందోళన
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై సంస్థ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. కార్పొరేట్ గవర్నెన్స్‌కి సంబంధించి గత బోర్డు సరైన విధానాలు పాటించకపోవడంపైనే తాను ఆందోళన వ్యక్తం చేశానని ఆయన చెప్పారు. ఈ వ్యవహారంలో వ్యక్తిగత ప్రయోజనాలేమీ ఇమిడి లేవని స్పష్టం చేశారు. చైర్మన్‌గా ఆర్ శేషసాయి, మరికొందరు బోర్డు సభ్యుల రాజీనామాతో సంస్థకు నూతనోత్తేజం కలిగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని, ఇవి కొనసాగుతాయన్నారు.
చైర్మన్‌గా నందన్ నీలేకని రాకతో మళ్లీ గవర్నెన్స్ ప్రమాణాలు తిరిగి రాగలవన్నారు. ఇన్ఫీకి అచ్ఛే దిన్(మంచి రోజులు) తెచ్చే ప్రయత్నాల్లో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు మూర్తి పేర్కొన్నారు. ఇన్ఫీ ప్రమోటర్లతో విభేదాల నేపథ్యంలో సీఈవోగా విశాల్ సిక్కా, పలువురు బోర్డు సభ్యులు రాజీనామా చేయడం, సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని తిరిగి చైర్మన్ పదవి చేపట్టడం తెలిసిందే. సంస్కృతి, మంచిపేరు, విలువల్ని ఆస్తులుగా కంపెనీకి ఇచ్చామని.. సంస్థలో చెప్పుకోతగిన స్థాయిలో వాటాలు ఉన్నప్పటికీ ప్రమోటర్లు స్వచ్ఛందంగా తప్పుకున్న దాఖలాలు దేశ కార్పొరేట్ చరిత్రలోనే లేవని మూర్తి వ్యాఖ్యానించారు.