ఐటీ, టెలికం, నీతి ఆయోగ్‌ల సహకారంతో
న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపుల విధానాలపై అవగాహన కల్పించడానికి నాస్కామ్ ముందుకు వచ్చింది. కీలకమైన నగరాలు, పట్టణాల్లో పేద ప్రజలకు ఈ విధానాల పట్ల అవగాహన కల్పిస్తామని, శిక్షణ ఇస్తామనినాస్కామ్ తెలిపింది. దీనికి గాను ఐటీ, టెలికామ్ మంత్రిత్వ శాఖలతో నీతి ఆయోగ్‌ల నుంచి సిబ్బంది సహకారాన్ని కోరుతూ నాస్కామ్ ఒక లేఖ రాసింది. కనీసం వంద మంది వాలంటీర్లనైనా ఐటీ, టెలికం మంత్రిత్వశాఖలు, నీతి ఆయోగ్ సమకూర్చాలని కోరింది. వీలైనంత ఎక్కువ మందికి అవగాహన, శిక్షణనిచ్చే రెండు దశల విధానాన్ని నీతి ఆయోగ్, ఐటీ, టెలికం మంత్రిత్వ శాఖలు రూపొందించాయని నాస్కామ్ పేర్కొంది.
ఈశిక్షణనిచ్చే కార్యక్రమాన్ని నాస్కామ్, నాస్కామ్ ఫౌండేషన్‌ల సహకారంతో అమలు చేస్తామని వివరించింది. మొదటి దశలో సభలు, వ్యక్తిగతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొంది. రెండో దశలోకాల్‌సెంటర్ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి నగదు రహిత చెల్లింపులపై అవగాహనతో పాటు శిక్షణను ఈ నెల 30 వరకూ ఇస్తామని వివరించింది. ఐటీ రంగంలోని ప్రతి ఒక్క ఉద్యోగి కనీసం పదిమందికైనా ఆన్‌లైన్‌చెల్లింపుల విధానాలపై శిక్షణ ఇవ్వాలని నాస్కామ్(నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) కోరింది.