భారత్పై క్వాల్కామ్ దృష్టి | Qualcomm's executive chairman Satellite project for IT, Telecom | Sakshi
Sakshi News home page

భారత్పై క్వాల్కామ్ దృష్టి

Published Tue, Aug 30 2016 1:01 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

భారత్పై క్వాల్కామ్ దృష్టి - Sakshi

భారత్పై క్వాల్కామ్ దృష్టి

ఐటీ, టెలికం మంత్రులతో క్వాల్‌కామ్ చైర్మన్ సమావేశం
న్యూఢిల్లీ: మొబైల్ చిప్‌ల విభాగంలో ప్రపంచ అగ్రగామి కంపెనీ క్వాల్‌కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పౌల్‌జాకబ్స్ సోమవారం కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్, టెలికం మంత్రి మనోజ్ సిన్హాతో భేటీ అయ్యారు. శాటిలైట్ అనుసంధాన ప్రాజెక్టుతోపాటు భారత్‌లో చిప్‌ల తయారీపై చర్చించారు. భారత్‌లో కార్యకలాపాల విస్తరణ, శాటిలైట్ ఆధారిత సమాచార నెట్‌వర్క్ ‘వన్ వెబ్’పై ఐటీ మంత్రితో చర్చించగా.. వన్ వెబ్‌పై టెలికం మంత్రితోనూ సమాలోచనలు జరిపారు. వన్ వెబ్ ప్రాజెక్టును క్వాల్‌కామ్ 2019-20లో ప్రారంభించే యోచనలో ఉంది.

 శాటిలైట్ ప్రాజెక్టుపై చర్చలు
‘శాటిలైట్ కంపెనీ వన్ వెబ్‌లో పెట్టుబడుల గురించి చర్చించాం. 700 శాటిలైట్లను నిర్మించి 2019-20 నాటికి ప్రారంభించనున్నాం. మారుమూల ప్రాం తాలకు బ్రాండ్‌బ్యాండ్ అనుసంధానాన్ని ఈ ప్రాజెక్టు కల్పిస్తుంది. దాంతో ఆయా ప్రాంతాలు సైతం మిగిలిన నెట్‌వర్క్‌తో కలసిపోతాయి’ అని సమావేశం అనంతరం పౌల్‌జాకబ్స్ వెల్లడించారు. పాఠశాలలకు, ఆస్పత్రులకు బ్రాడ్‌బ్యాండ్ అందించాలనుకుంటున్నామని చెప్పారు. దేశంలో చిప్‌సెట్ తయారీని ఎప్పుడు ప్రారంభించబోతున్నారన్న విలేకరుల ప్రశ్నలకు జాకబ్స్ స్పందిస్తూ... దీనిపై చిప్ తయారీదారులతో ప్రాథమిక స్థాయి చర్చలు జరిపామని, ఇంకా తయారీ వివరాలు వెల్లడించే దశకు రాలేదని చెప్పారు. కాగా, స్పెక్ట్రమ్ రిజర్వ్ ధర చాలా అధిక స్థాయిలో ఉందని జాకబ్స్ అభిప్రాయపడ్డారు.

 వన్‌వెబ్...: వన్‌వెబ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను తక్కువ భూ కక్ష్య(ఎల్‌ఈవో)లో వందలాది ఉపగ్రహాలతో ఒక సమూహంగా ఏర్పాటు చేస్తారు. ఈ ఉపగ్రహాలు భూమిపై 1200 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ఒకదానికొకటి సమన్వయంతో పనిచేస్తూ అతిపెద్ద అనుసంధాన ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తాయి. ప్రస్తుత జియోసింక్రనస్ విధానంలో ఉపగ్రహాలు భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి. అయితే, వన్‌వెబ్ ప్రాజెక్టులో ఉపగ్రహాలు తక్కువ ఎత్తులో ఉండడం వల్ల అవి స్పందించే సమయం తగ్గిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement