బ్యాంక్ షేర్లతో స్వల్ప లాభాలు
33 పాయింట్ల వృద్ధితో 27,565కు సెన్సెక్స్
కీలక రేట్లను భారత రిజర్వ్ బ్యాంక్ తగ్గిస్తుందన్న అంచనాలతో బుధవారం బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. దీంతో రెండు రోజుల స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. వాహన,టెక్నాలజీ కంపెనీలు ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం, మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ముగింపుకు వస్తుండటంతో రోజంతా నష్టాల్లోనే ఉన్న స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ చివర్లో స్వల్ప లాభాలతో గట్టెక్కింది.
మొత్తం మీద సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 27,565పాయింట్ల వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 8,335 పాయింట్ల వద్ద ముగిశాయి. 1,453 షేర్లు నష్టపోగా, 1,196 షేర్లు లాభపడ్డాయి. కాగా విదేశీ ఇన్వెస్టర్లు రూ.935 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.594 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.