పాలసీకి ‘ముందు జాగ్రత్త’
221 పాయింట్ల శ్రేణిలో సెన్సెక్స్ కదలిక...
* చివరకు 21 పాయింట్ల లాభంతో 27,849 వద్ద ముగింపు
ముంబై: రిజర్వు బ్యాంకు మంగళవారంనాడు క్రెడిట్ పాలసీని సమీక్షించనున్న నేపథ్యంలో సోమవారం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో సోమవారం ఆద్యంతం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ దిశ, దశ లేకుండా తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య సాగింది. వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో కన్స్యూమర్ గూడ్స్ షేర్లు లాభపడ్డాయి.
అయితే సన్ ఫార్మా 9 శాతం పతనం కావడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాలకు కళ్లెం పడింది. మొత్తం మీద 221 పాయింట్ల రేంజ్‌లో కదలాడి.న సెన్సెక్స్ చివరకు 21 పాయింట్ల స్వల్ప లాభంతో 27,849 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.25 పాయింట్ల నష్టంతో 8,433 పాయింట్ల వద్ద ముగిసింది.
ప్రారంభంలో జీడీపీ జోష్...
గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.3 శాతానికి పెరగడం, మేలో తయారీ రంగం జోరు పెరగడం సెంటిమెంట్‌కు ఊతాన్నిచ్చాయి. ‘‘రేట్ల కోత కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. అందుకే పలు వాహన కంపెనీల మే నెల విక్రయ గణాంకాలు బాగున్నప్పటికీ స్టాక్ మార్కెట్‌ల్లో ఉత్తేజాన్ని నింపలేకపోయాయి’’ అని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. జీడీపీ గణాంకాల జోష్‌తో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒక దశలో 27,959 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయికి చేరింది. లాభాల స్వీకరణతో 27,738 పాయింట్ల కనిష్ట స్థాయికి పడింది. ఇక నిఫ్టీ 8,467-8,405 పాయింట్ల మధ్య కదలాడింది.
ఎల్ అండ్ టీ 3 శాతం అప్
రూ.1,099 కోట్ల ఆర్డర్లు లభించడంతో ఎల్ అండ్ టీ షేర్ 3 శాతం లాభపడి రూ.1,705 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడిన షేర్ ఇదే.1,528 షేర్లు నష్టాల్లో, 1,210 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,699 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.15,610 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,26,488 కోట్లుగా నమోదైంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.