రేట్ల కోతతో ఉత్సాహం
భారత రిజర్వ్ బ్యాంక్ అనూహ్యంగా రెపో రేటును తగ్గించడంతో స్టాక్ మార్కెట్లు గురు, శుక్రవారాల్లో ర్యాలీ జరిపాయి. ముఖ్యంగా రేటు తగ్గింపు వార్త వెలువడిన గురువారం అతిపెద్ద ర్యాలీని నిర్వహించాయి. ఆ రోజున సెన్సెక్స్ ఐదేళ్లలో అతి పెద్ద ర్యాలీ జరిపి 729 పాయింట్లు లాభపడింది. 2009 మే 18 తర్వాత పాయింట్ల రీత్యా సూచీ ఇంత అధికంగా పెరగడం ఇదే ప్రధమం. ఆ రోజున 2,110 పాయింట్ల ర్యాలీ జరిగింది. స్విట్జర్లాండ్ బ్యాంక్ ఉదంతం, లాభాల స్వీకరణ కారణంగా ఈ జోరు శుక్రవారం కొంత తగ్గినప్పటికీ, సెన్సెక్స్ 46 పాయింట్లు లాభపడింది. వెరశి సెన్సెక్స్ రెండు రోజుల్లో 775 పాయింట్లు ఎగిసింది. గురువారం వడ్డీ రేట్ల ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్, రియల్టీ, ఆటోమొబైల్ షేర్లు జోరుగా పెరగ్గా, శుక్రవారం వినియోగవస్తువులు, ఫార్మా, విద్యుత్ రంగానికి చెందిన బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఇటు నిఫ్టీ గురువారం 216 పాయింట్లు, శుక్రవారం 20 పాయింట్లు మొత్తం రెండు రోజుల్లో 236 పాయింట్లు లాభాన్ని సాధించింది. శుక్రవారం ట్రేడింగ్ చివరకు సెన్సెక్స్ 28,122 పాయింట్లు, నిఫ్టీ 8,514 వద్ద ముగిశాయి.
ఊహించని కోత
కొన్ని రోజులుగా నిస్తేజంగా, స్తబ్దుగా సాగుతున్న స్టాక్‌మార్కెట్లు ఆర్‌బీఐ రేట్ల కోతతో గురువారం పరుగులు తీశాయి. సెన్సెక్స్ 500 పాయింట్ల గ్యాఅప్‌తో మొదలైంది. దీంతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. రేట్ల కోత కారణంగా గృహ, వాహన, ఎలక్ట్రిక్ వస్తువుల రుణాలు చౌకగా లభిస్తాయి. దీంతో ఈ రంగాల షేర్లేతో పాటు అన్ని రంగాల షేర్లూ దూసుకుపోయాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం 1 శాతం పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు మరింత బలాన్నిచ్చింది. గురువారం సెన్సెక్స్ 28 వేల మార్క్‌ను మళ్లీ అధిగమించింది. ఇన్వెస్టర్ల సంపద మళ్లీ వంద లక్షల కోట్ల మార్క్‌ను దాటింది.
వంద లక్షల కోట్లకు షేర్ల సంపద
గురువారం రేట్లకోతతో స్టాక్ మార్కెట్లు దూసుకుపోవడంతో ఇన్వెస్టర్ల సంపద మళ్లీ వంద లక్షల కోట్లకు చేరింది. కాగా ప్రపంచంలో అతి పెద్ద పది స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ఒకటిగా బీఎస్‌ఈ నిలిచింది.
ఇది ఆరంభమే
భారీగా రేట్ల కోతకు తెర లేచిందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకుడు చేతన్ అహ్య వ్యాఖ్యానించారు. ఇది ఆరంభమేనని, ఈ ఏడాది 1.25 శాతం వరకూ రేట్ల కోత ఉండొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
ఏడాది గరిష్టానికి 192 షేర్లు
ఆర్‌బీఐ రేట్ల కోతతో గురువారం దాదాపు 192 షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయి.
క్యాపిటల్ మార్కెట్‌లో లావాదేవీలు
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ ట్రేడింగ్
విభాగం తేదీ కొనుగోలు అమ్మకం నికర విలువ
డీఐఐ : 16-01 1,418 2,135 -717
ఎఫ్‌ఐఐ: 16-01 6,718 5,618 1,100
(విలువలు రూ.కోట్లలో)