8 శాతం పెన్షన్ స్కీమ్ లాంచ్, కేవలం వారికే..
ప్రధాన్ మంత్రి వయా వందన యోజన(పీఎంవీవీవై) పెన్షన్ స్కీమ్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ కేవలం 60ఏళ్లు, ఆపైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు(60ఏళ్లు, ఆపైబడిన వారికి) ప్రభుత్వం 10ఏళ్ల పాటు గ్యారెంటీ వడ్డీని ఇవ్వనుంది. పదేళ్ల కాలం పాటు ఉండే ఈ పాలసీలో పాలసీదారు కోరుకున్న విధంగా ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, పన్నెండు నెలల పద్ధతిలో పెన్షన్ అందుతుంది. 2017 మే 4 నుంచి ఈ స్కీమ్ ఆఫర్ చేయడాన్ని ఎల్‌ఐసీ ప్రారంభించింది. 2018 మే 3 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎల్‌ఐసీ ద్వారా ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లోనూ ఈ స్కీమ్‌ను కొనుగోలుచేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో ఏడాది పెన్షన్ ప్లాన్‌ను ఎంపికచేసుకుంటే, కనీసం 1,44,578 రూపాయలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.7,22,892ను ఇన్వెస్ట్ చేయాలి. నెలవారీ పెన్షన్ ప్లాన్‌ను ఎంపికచేసుకున్న పక్షంలో కనీసం రూ.1,50,000, గరిష్టంగా రూ.7,50,000 పెట్టుబడులుగా పెట్టాలి.
రూ.1,50,000 పెట్టుబడులు పెట్టిన వారు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ పొందుతారు. అదేవిధంగా రూ.7,50,000 ఇన్వెస్ట్‌చేస్తే నెలవారీ పెన్షన్ రూ.5000 ఆర్జించే అవకాశముంది. ఒకవేళ 10ఏళ్ల కాల వ్యవధిలో పెన్షనర్ మరణిస్తే, కొనుగోలుచేసిన మొత్తాన్ని బెనిఫియరీకి అందిస్తారు. 10 ఏళ్ల కాలవ్యవధి అయిపోయే సమయానికి 98 శాతం కొనుగోలు ధరంతా రీఫండ్ అయిపోతుందని ప్రభుత్వం చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ స్కీమ్ నుంచి బయటికి వైదొలిగే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పాలసీపై జీఎస్‌టీ మినహాయింపు కూడా కల్పించడంతో పాటు, కొనుగోలు ధరపై 75 శాతం రుణసదుపాయం కూడా ఉంది. అయితే పాలసీ కాలం మూడేళ్లు పూర్తైన తర్వాతే ఆ అవకాశం లభిస్తుంది.