‘బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల రంగంపై జీఎస్టీ ప్రభావం’ నివేదికతో బీఏవోఏ ప్రెసిడెంట్ రోహిత్ కపూర్, ఉషా పధి, చౌకియాల్ (కుడి)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన రంగంలో కొద్ది రోజుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. సామాన్యుడికి విమానయోగం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ కింద మరిన్ని చిన్న నగరాల్లో విహంగాలు ఎగురనున్నాయి. కొత్తగా 56 ఎయిర్‌పోర్టులు, 31 హెలిపోర్టులు 18 నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటి అభివృద్ధికి రూ.4,500 కోట్లు వెచ్చిస్తున్నట్టు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పధి వెల్లడించారు. విమానాశ్రయాల అభివృద్ధిపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ‘పెద్ద విమానాశ్రయాలు బిజీ అవడంతో ఆపరేటర్లకు స్లాట్స్ కేటాయించడం క్లిష్టమైంది. దీంతో తప్పని పరిస్థితుల్లో విమానయాన సంస్థలు చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లతో రంగంలోకి దిగుతున్నాయి. మొత్తంగా మూడు, నాల్గవ తరగతి నగరాలకూ సేవలు విస్తరించాయి’ అని వివరించారు. బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ (బీఏవోఏ) బుధవారమిక్కడ నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
మరో రూ.20,500 కోట్లతో: విమానాశ్రయాల అభివృద్ధికై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చే అయిదేళ్లకుగాను రూ.20,500 కోట్లు వెచ్చించనుంది. ఈ మొత్తంతో 20 విమానాశ్రయాలు కొత్తగా అందుబాటులోకి వస్తాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.కె.చౌకియాల్ వెల్లడించారు. ‘విజయవాడలో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం చేపడతాం. ఈ నగరంలో రన్‌వే పనులు నడుస్తున్నాయి. తిరుపతి, కడపలో రన్‌వే పనులు చేపట్టాల్సి ఉంది. ఇవేగాక పలు విమానాశ్రయాల స్థాయి పెంచడం, టెర్మినళ్ల విస్తరణ, ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలకు ఖర్చు చేస్తాం’ అని తెలిపారు. కేంద్రం సమకూర్చే నిధులతోపాటు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విమాన ఆపరేటర్లకు ఆర్థిక సాయం చేస్తోందని గుర్తు చేశారు. 11 ఎయిర్‌స్ట్రిప్‌లకు యూపీ ప్రభుత్వం అదనంగా సాయం చేసిందన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ప్రోత్సహిస్తే ఆపరేటర్లు ముందుకు వస్తారని అన్నారు. ఉడాన్ స్కీమ్ కింద ఆపరేటర్లు సర్వీసులు అందించేందుకు ఆసక్తి కనబరిస్తేనే ఎయిర్‌స్ట్రిప్‌ల అభివృద్ధి చేపడతామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment