'బ్లాక్ బెరీ'లో కొత్త ఫీచర్లు
న్యూఢిల్లీ: కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ బ్లాక్ బెరీ ఇప్పుడు వినియోగదారులకు మరికొన్ని కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. బ్లాక్ బెరీ మొబైల్ నుంచి ఇతరులకు పంపే సందేశాల్లో గోప్యతను పెంచేందుకు, వినియోగదారులే కంటెంట్ ను నియంత్రించే మెరుగైన అవకాశాలను కల్పిస్తోంది. ఈ కొత్త సదుపాయాన్ని ఎటువంటి ఛార్జీలు, ప్రత్యేక ఫీజులు లేకుండా యూజర్లకు అందుబాటులోకి తెస్తోంది.
యాండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లలో ఎటువంటి ఫీజు లేకుండా కొత్త ఐవోఎస్ అప్ డేట్స్ అందిస్తోంది. యూజర్ల సౌకర్యార్థం వారు షేర్ చేసుకునే సందేశాలు, కంటెంట్ తమ నియంత్రణలోనే ఉంచుకునేందుకు బీబీఎం వినియోగదారులకు ఈ కొత్త అభివృద్ధి సహకరిస్తుందని బ్లాక్ బెరీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాథ్యూటాల్బోట్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తమ ఫోన్ నుంచిపొరపాటున కానీ, ఇష్టప్రకారం కానీ పంపిన మెసేజ్ లు, ఫొటోలు తిరిగి వెనక్కు రప్పించుకునే అవకాశం ఇప్పుడు బ్లాక్ బెరీలో ఉంది. అలాగే తాము పంపిన మెసేజ్ లు, ఫొటోలు ఇతరులకు ఎన్నాళ్ళ పాటు కనిపించాలో కూడా నిర్ణయించేందుకు వీలుగా టైమర్ ను సెట్ చేసుకునే అవకాశం ఇకపై అందుబాటులోకి వస్తుందని మాథ్యూ తెలిపారు.
దీనికితోడు కొన్ని అదనపు కీ ఫీచర్లను కూడా బీబీఎం అందుబాటులోకి తెచ్చింది. ఒకరినుంచీ ఒకరికి ఛాట్ మెసేజ్ లను ఫార్వర్డ్ చేసే అవకాశం తోపాటు... విభిన్న వ్యక్తులతో ఛాట్ చేస్తున్నపుడు యాండ్రాయిడ్ లో మ్యూట్ నోటిఫికేషన్లు అందించే సామర్థ్యాన్ని బీబీఎం కొత్తగా కల్పించింది. అంతేకాక ఎన్నో మెరుగైన సందుపాయాలను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన బ్లాక్ బెరీ.. ఇప్పుడు వీడియో షేరింగ్ ఆప్షన్ నూ అందిస్తోంది. ఈ కొత్త పద్ధతిలో అతి పెద్ద వీడియోలను సైతం క్యాప్చర్ చేసి ఇతరులకు షేర్ చేసే అవకాశం ఉంది. ఇవే కాక కొత్త ఛాట్ స్క్రీన్ ను ఐవోఎస్ అందిస్తోంది. యాండ్రాయిడ్ మార్ష్మాల్ల (6.0) ద్వారా ఇప్పుడు బీబీఎం పని చేస్తుంది.