మార్కెట్ పంచాంగం
ఇయర్‌ఎండ్ షార్ట్ కవరింగ్‌తో వరుసగా మూడోవారం భారత్ సూచీలు కూడా పెరిగాయి. దాదాపు ప్రతీ ఏడాదీ జనవరి తొలివారంలో భారత్ మార్కెట్ సానుకూలంగా వుంటుంది. కానీ పలు సందర్భాల్లో జనవరి రెండు, మూడోవారాల్లో డౌన్‌ట్రెండ్‌ను ఇన్వెస్టర్లు చవిచూస్తుండేవారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సంవత్సరాంతపు సెలవుల నుంచి తేరుకుని, కొత్త సంవత్సరం రెండోవారం నుంచి చురుగ్గా ట్రేడ్ చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా అదేట్రెండ్ పునరావృత్తమవుతుందా లేదా అనేది అంచనావేయలేముగానీ...ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వుండటం అవసరం.
జనవరి తొలివారంలో వెలువడే అమెరికా జాబ్స్ డేటా తదితర కీలక గణాంకాలు రానున్న నెలల్లో అక్కడి కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తీసుబోబోయే నిర్ణయాలకు బాట వేస్తాయి. సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
జనవరి 1తో ముగిసినవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో 322 పాయింట్ల లాభంతో 26.161 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే క్రితం వారం వరుసగా నాలుగు రోజులపాటు గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రీతిలో 26,100-26,250 పాయింట్ల నిరోధ శ్రేణి మధ్య అవరోధాన్ని చవిచూసింది. రానున్న రోజుల్లో ఈ శ్రేణిని బలంగా ఛేదిస్తేనే, తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. 26,250 పాయింట్లపైన 26,567 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అక్టోబర్ 26 నాటి 27,618 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి డిసెంబర్ 14నాటి 24,867 పాయింట్ల వరకూ జరిగిన పతనంలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 26,567 పాయింట్లు.
ఈ స్థాయిని దాటితే రానున్న వారాల్లో 75 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 26,930 పాయింట్ల వద్దకు పెరిగే ఛాన్స్ వుంటుంది ఈ వారం పైన ప్రస్తావించిన తొలి నిరోధాన్ని అధిగమించలేకపోతే 25.940 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఆ లోపున 25,700 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 25,400 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు.
7,980పైన నిఫ్టీ అప్‌ట్రెండ్ కొనసాగింపు
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 102 పాయింట్ల లాభంతో 7.963 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లానే నిఫ్టీ సైతం 7,940-7,980 పాయింట్ల శ్రేణి మధ్య గతవారం పలుదఫాలు అవరోధం ఎదుర్కొన్నది. ఈ శ్రేణిని బలంగా దాటగలిగితేనే నిఫ్టీ తదుపరి ర్యాలీ సాధ్యపడుతుంది. 7,980 పాయింట్ల పైన నిఫ్టీ వెనువెంటనే 8,036 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.
ఇది గతంలో 8,336 పాయింట్ల నుంచి 7,551 పాయింట్ల వరకూ జరిగిన పతనంలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి. అటుపైన ముగిస్తే 75 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 8,140 పాయింట్ల వరకూ నిఫ్టీ పెరగవచ్చు. ఈ వారం నిఫ్టీ 7,980 పాయింట్లపైన స్థిరపడలేకపోతే 7,890 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభించవచ్చు. ఈ లోపున క్రమేపీ 7,830 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 7,730 పాయింట్ల స్థాయి వద్దకు క్షీణించవచ్చు.
26,250 దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్
Published Mon, Jan 4 2016 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM
Advertisement