మార్కెట్ పంచాంగం
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ జూన్-జూలై నెలల్లో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు క్రమేపీ బలపడుతున్నాయి. తన పాలసీకి మార్కెట్లను సిద్ధంచేయడంలో భాగంగా పదేపదే వడ్డీ రేట్ల పెంపు ప్రస్తావనను ఫెడ్ అధికారులు తీసుకొస్తున్నారు. రేట్ల పెంపు అంచనాలతో తొలుత ప్రపంచ సూచీలు సర్దుబాటుకు లోనైనా, గతవారం ఆ భయాలను వదిలి ప్రపంచ సూచీలు పెరిగాయి. ఫెడ్ ఛైర్‌పర్సన్ కూడా ఇదే ప్రకటనను గత శుక్రవారం చేసినప్పటికీ, ఆ రోజున అమెరికా మార్కెట్ పెరుగుదలతో ముగిసింది.
రేట్ల పెంపునకు ఈక్విటీ మార్కెట్ సంసిద్ధమైనట్లు ఈ ట్రెండ్ సూచిస్తున్నది. ఇందుకు అనుగుణంగా భారత్ సూచీలు కూడా గతవారం పెద్ద బ్రేక్‌అవుట్ సాధించాయి. అంటే...వచ్చే ఒకటి, రెండు నెలల్లో ఫెడ్ రేట్లను పెంచేవరకూ ప్రస్తుత అప్‌ట్రెండ్ చిన్న సర్దుబాట్లతో కొనసాగే అవకాశాలున్నట్లు భావించవచ్చు. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాలు...
మే నెల 27తో ముగిసిన వారంలో వరుసగా నాలుగురోజులపాటు ర్యాలీ జరిపిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 1,357 పాయింట్ల లాభంతో 26,653 వద్ద ముగిసింది. ఈ వారం చిన్న కరెక్షన్లు జరిగినా సెన్సెక్స్ 27,142 పాయింట్ల లక్ష్యాన్ని చేరే ఛాన్సుంది. గత ఏడాదిన్నరగా 30,025 నుంచి 22,495 వరకూ జరిగిన కరెక్షన్‌లో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 27,142 పాయింట్లు.
ఈ లక్ష్యాన్ని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే క్రమేపీ 28,135 స్థాయిని అందుకునే వీలుంటుంది. మధ్యలో 27,620 పాయింట్ల స్థాయి చిన్నపాటి అవరోధాన్ని కల్గించవచ్చు. గతవారం మార్కెట్ ర్యాలీ సందర్భంగా ఏర్పడిన గ్యాప్ స్థాయిలు ఈ వారం మార్కెట్ తగ్గితే మద్దతును అందించవచ్చు. తొలి మద్దతు 26,400 పాయింట్ల సమీపంలో లభిస్తుండగా, తదుపరి మద్దతు 25,940-25,897 పాయింట్ల శ్రేణి మధ్య వుంది. 30 రోజుల చలన సగటు (30 డీఎంఏ) రేఖతో పాటు 200 డీఎంఏ రేఖ కదులుతున్న 25,640 పాయింట్ల స్థాయి ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు చివరి మద్దతు.
8,243 పాయింట్ల దిశగా నిఫ్టీ
కొద్ది నెలల నుంచి అవరోధం కల్పిస్తున్న 8,000 పాయింట్ల స్థాయిని ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఎట్టకేలకు ఛేదించి చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 407 పాయింట్ల భారీలాభంతో 8,157 వద్ద ముగిసింది. గట్టి అవరోధాన్ని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదించిన ఫలితంగా ఈ వారం నిఫ్టీ మరింత పెరిగే అవకాశం వుంది. తొలుత 8,243 లక్ష్యాన్ని అందుకోవొచ్చు. 9,120 నుంచి 6,825 వరకూ గతంలో జరిగిన సర్దుబాటుకు 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 8,243 పాయింట్లు.
ఈ స్థాయిని కూడా అధిగమిస్తే రానున్న వారాల్లో నిఫ్టీ 8,546 వరకూ ర్యాలీ జరిపే ఛాన్స్ వుంది. మధ్యలో 8,340 పాయింట్ల వద్ద ఒక అవరోధం కలగవచ్చు. ఈ వారం మార్కెట్ తగ్గితే నిఫ్టీకి 8,080 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోయి, ముగిస్తే తదుపరి మద్దతు 7,940 పాయింట్ల వద్ద లభ్యం కావొచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 7,809-7,761 పాయింట్ల శ్రేణి మధ్య బలమైన మద్దతును పొందవచ్చు. ఇది గతవారం నిఫ్టీకి పెద్ద గ్యాప్‌కావడంతో పాటు 200 డీఎంఏ, 30 డీఎంఏ రేఖలు ఇదే శ్రేణి మధ్య కదులుతున్నాయి.
సెన్సెక్స్ లక్ష్యం 27,142
Published Mon, May 30 2016 4:05 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM
Advertisement