నిషేధం అమలు మరో 11 సిటీల్లో ?
న్యూఢిల్లీ : దేశ రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పెద్ద డీజిల్ వాహనాల అమ్మకం నిషేధం మరో 11 సిటీలపై కూడా విధించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్ జీటీ) నేడు నిర్ణయం తీసుకోనుంది. 11 సిటీల్లో గాలి కాలుష్య డేటా ఆధారంగా ఎన్ జీటీ ఈ నిషేధాన్ని ఆ ప్రాంతాలకు కూడా విధించనుంది. ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పట్నా, లక్నో, అలహాబాద్, కాన్పూర్, వారణాసి, పుణే, నాగ్ పూర్, లుథీనా, జలంధర్, అమృత్ సర్ వంటి సిటీలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. 2015 డిసెంబర్ లో దేశ రాజధాని ఢిల్లీ, దాన్ని పరిసర ప్రాంతాల్లో రెండు లీటర్లు, అంతకు ఎక్కువ సామర్థ్యమున్న డీజిల్ ఇంజన్ వాహనాలను నిషేధిస్తున్నట్టు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి ఆ ప్రాంతాల్లో ఎక్కువ డీజిల్ ఇంజన్ సామర్థ్యమున్న వాహనాల అమ్మకాలు జరగడం లేదు. ఇదే నిషేధాన్ని కేరళలో కొన్ని సిటీల్లో కూడా ఇటీవలే విధించారు. దీంతో ఆటో పరిశ్రమలో పెట్టుబడులు కోల్పోయాయి. 11వేల వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. ఈ ప్రభావం ఆటో పరిశ్రమల్లో ఉద్యోగులపై పడి, 5,500 మంది ఉద్యోగాలు కోల్పోయారని భారత ఆటో మొబైల్ తయారీదారుల సొసైటీ(సియామ్) పేర్కొంది. ఒకవేళ ఈ నిషేధం దేశమంతటా విధిస్తే దాదాపు 44 వేల ఉద్యోగాలకు నష్టం చేకూరుతుందని సియామ్ రిపోర్టు నివేదించింది. ఈ నిషేధం నిర్ణయం ఆటో పరిశ్రమల్లో తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంది. ఉత్పత్తి, ఉద్యోగాల్లో నష్టాలు చేకూరుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.