
ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలోకి ఢిల్లీతో పాటు మరో రెండు భారతీయ నగరాలు చేరాయి. దేశమంతా ఆదివారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ మొత్తంలో బాణాసంచా కాల్చడంతో ఆ విషపూరిత పొగ గాలిని కమ్మేసింది. ఫలితంగా గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది.
ప్రపంచంలో వాతావరణ కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల జాబితాను స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఎప్పటిలాగే దేశ రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా అగ్ర స్థానంలో నిలించింది. ప్రస్తుతం అక్కడ గాలి నాణ్యత సూచీ 420 ఉండటంతో దీన్ని 'ప్రమాదకర' కేటగిరీలో చేర్చింది.
టాప్-10 లో మరో రెండు నగరాలు
అత్యంత కాలుష్యపూరిత నగరాల టాప్ 10 జాబితాలోకి భారత్ చెందిన మరో రెండు నగరాలు చేరాయి. 196 ఏక్యూఐతో కోల్‌కతా నాల్గవ స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై 163 ఏక్యూఐతో ఎనిమిదో స్థానంలో ఉంది.
ఏక్యూఐ స్థాయి 400-500 ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఉన్న వ్యాధులు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. ఇక 150-200 స్థాయి ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఏక్యూఐ స్థాయి 0-50 ఉంటే అది మంచిదిగా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment