
మార్కెట్ కు రెండో రోజూ నష్టాలు
సెన్సెక్స్‌కు 59 పాయింట్ల నష్టం
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు బుధవారం కూడా స్వల్పంగా నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్... సెప్టెంబర్ మొదటి వారంలోనే వడ్డీ రేట్లను పెంచవచ్చన్న తాజా అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా కౌంటర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 59 పాయింట్లు కోల్పోయి 28005.37 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం సెన్సెక్స్ 87.79 పాయింట్ల నష్టాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.
నిఫ్టీ సైతం 18.50 పాయింట్ల నష్టంతో 8624.05 వద్ద స్థిరపడింది. సూచీలు ఆద్యంతం ఊగిసలాట ధోరణిలోనే కొనసాగాయి. న్యూయార్క్ ఫెడ్ ప్రెసిడెంట్ విలియమ్ డూడ్లే యూఎస్ ఫెడ్ సెప్టెంబర్‌లోనే వడ్డీరేట్లను పెంచవచ్చంటూ చేసిన ప్రకటన... రేట్ల పెంపుపై అంచనాలకు అవకాశం కల్పించిందని, దీంతో ప్రపంచ మార్కెట్లు వేచి చూసే ధోరణి అనుసరించాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. ముఖ్యంగా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మినిట్స్ వెలువడనుండడం కూడా దేశీయ మార్కెట్ల నష్టాలకు కారణంగా పేర్కొన్నారు.
ఆసియా మార్కెట్లు చైనా, హాంగాకాంగ్, సింగపూర్, దక్షిణకొరియా 0.02 నుంచి 0.54 శాతం వరకూ నష్టపోయాయి. యూరోపియన్ మార్కెట్లు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మార్కెట్లు కూడా స్వల్ప నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.