విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్ | Non-bailable warrant issued against Vijay Mallya in money ... | Sakshi
Sakshi News home page

విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్

Published Tue, Apr 19 2016 1:55 AM | Last Updated on Wed, Oct 17 2018 6:34 PM

విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్ - Sakshi

విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్

ఐడీబీఐ నుంచి రూ.900 కోట్ల రుణం కేసులో ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు
ముంబై: బ్రిటన్‌లో ఉన్నట్లు భావిస్తున్న ‘ఉద్దేశపూ ర్వక రుణ ఎగవేతదారు’ విజయ్ మాల్యా మరింత ఇరుకున పడ్డారు. ఆయన అరెస్టుకు ఇక్కడి ప్రత్యేక కోర్టు (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు జడ్జి పీఆర్ భావ్‌కీ సోమవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. రూ.900 కోట్లు ఐడీబీఐ బ్యాంక్ రుణం కేసులో మూడుసార్లు సమన్లు పంపినా... మాల్యా పట్టించుకోలేదని ఈడీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈడీ విజ్ఞప్తి మేరకు మాల్యా డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను కేంద్రం నాలుగువారాల పాటు సస్పెన్షన్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.
 
కింగ్‌ఫిషర్ పిటిషన్ కొట్టివేత
కాగా ఐడీబీఐ బ్యాంక్ నుంచి తీసుకున్న రు.900 కోట్ల రుణంలో సగం మొత్తాన్ని విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు మాల్యా వెచ్చించినట్లు ఈడీ చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ... కింగ్‌ఫిషర్ దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను కూడా ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషన్‌ను దాఖలు చేసిన వెన్వెంటనే కోర్టు దీనిని తోసిపుచ్చింది.  మాల్యా తన, అలాగే తన కుటుంబ సభ్యుల దేశ, విదేశాల్లో ఆస్తుల వివరాలను ఈ నెల 21వ తేదీలోపు వెల్లడించాలని  సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ  కేసు తదుపరి విచారణ 26వ తేదీన జరగనుంది. ఇవ్వాల్సిన మొత్తంలో రూ.4,000 కోట్లు చెల్లించడానికి సిద్ధమని మాల్యా చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకింగ్ గ్రూప్ విన్నవించిన నేపథ్యంలో సుప్రీం సంబంధిత ఉత్తర్వులు ఇచ్చింది.  బ్యాంకులకు బకాయి వున్న రుణ మొత్తం రూ.6,903 కోట్లలో (వడ్డీకాకుండా) రూ. 4,000 కోట్లు తిరిగి చెల్లించేస్తానని గతంలో మాల్యా సుప్రీంకోర్టుకు విన్నవించారు.  

వివిధ వ్యాపార వివాదాలకు సంబంధించి తాము దాఖలు చేసిన కేసుల్లో రావాల్సివున్న మొత్తం వస్తే, మరో రూ.2,000 కోట్లు చెల్లిస్తామని ప్రతిపాదించారు.  అయితే వడ్డీలతో కలిపి మాల్యా వివిధ బ్యాంకులకు రూ. 9.000 కోట్లు బకాయివున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు గతంలో విన్నవించింది. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాలకు సంబంధించిన వివాదాన్ని అర్థవంతమైన సంప్రదింపుల ద్వారా, పరిష్కరించుకోవడం పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ.. తగిన మొత్తాలను తన ముందు డిపాజిట్ చేయాలని కూడా మాల్యాను న్యాయస్థానం ఆదేశించింది.
 
ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్ కోరతాం: ఈడీ
కాగా, నేడు ముంబై ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ ఆధారంగా విజయ్‌మాల్యా అరెస్ట్‌కు ఇంటర్‌పోల్ వారెంట్‌ను కోరబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి గ్లోబల్ పోలీస్ సంస్థకు త్వరలో సీబీఐ ద్వారా ఒక లేఖ పంపుతామని ఆ వర్గాలు తెలిపాయి.  మార్చి 2న దేశం నుంచి వెళ్లిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement