
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) రిటర్నులు దాఖలు చేయని అసెసీలు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి రానుంది. ప్రభుత్వం.. అలాంటి అసెసీల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడం లేదా ఏకంగా రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. జీఎస్‌టీ రిటర్నులను దాఖలు చేయని సంస్థలతో వ్యవహరించాల్సిన విధానాలకు సంబంధించి కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)ని రూపొందించింది. ఇందులో నిర్దిష్ట కఠిన చర్యలను కూడా చేర్చినట్లు తెలుస్తోంది.
దఫదఫాలుగా నోటీసులు...
కాంపొజిషన్ స్కీమ్ ఎంచుకున్న అసెసీలు.. మూడు నెలలకోసారి, మిగతా వారు నెలకోసారి జీఎస్‌టీ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటోంది. అయితే, జీఎస్‌టీ అసెసీల్లో 20 శాతం మంది రిటర్నులు దాఖలు చేయడం లేదని, దీనివల్ల పన్ను వసూళ్లు గణనీయంగా దెబ్బతింటున్నాయని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐసీ... ఎస్‌వోపీని తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం గడువులోగా చెల్లింపులు జరపని పక్షంలో డిఫాల్టరుకు ముందు సిస్టమ్ నుంచి ఒక నోటీస్ వెడుతుంది. ఆ తర్వాత అయిదు రోజుల్లోగా చెల్లించకపోతే.. ఫారం 3–ఎ కింద మరో నోటీసు జారీ అవుతుంది. ఇది వచ్చాక 15 రోజుల్లోగానైనా చెల్లించాల్సి ఉంటుంది. అప్పటికీ కట్టకపోతే.. అధికారులు సదరు అసెసీ కట్టాల్సిన పన్ను బాకీలను మదింపు చేసి, ఫారం ఏఎస్‌ఎంటీ–13 జారీ చేస్తారు.