ఎప్పటికో లాభమైనా... ఇప్పటికి నష్టమే!
• పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీపై ఎస్‌అండ్‌పీ విశ్లేషణ
• అసంఘటిత, గ్రామీణ, నగదు ఆధారిత విభాగాలకు నష్టం
• సావరిన్ రేటింగ్ మాత్రం తగ్గకపోవచ్చు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతోపాటు, 2017 సెప్టెంబర్ నుంచీ అమల్లోకి వస్తుందని భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)– తక్షణం అసంఘటిత, గ్రామీణ, అలాగే ఆభరణాలు, రియల్టీ వంటి నగదు ఆధారిత విభాగాలపై ‘తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని’’ చూపించనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో విస్తృత ప్రాతిపదికన డిమాండ్ తగ్గడం.... ఈ ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో అమలయ్యే జీఎస్‌టీ వల్ల పన్నుల భారం పెరిగి ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగించవచ్చని తాజా నివేదికలో అది విశ్లేషించింది. ‘‘భారత్‌లో పెద్ద నోట్ల రద్దు– జీఎస్‌టీ: స్వల్పకాలిక కష్టం– దీర్ఘకాలిక లాభం’’ అన్న పేరుతో ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ విశ్లేషకుడు అభిశేక్ దాంగ్రా ఒక వ్యాసం రాశారు.
దాన్లో పేర్కొన్న వివరాలను చూస్తే...
⇔ పెద్ద నోట్ల ప్రభావంతో రుణ మంజూరీలకు సంబంధించి అటు కార్పొరేట్లు, ఇటు బ్యాంకులు స్వల్పకాలంలో ఇబ్బందులను ఎదుర్కొంటాయి. ఇది జీడీపీ వృద్ధితీరు తగ్గుదలకూ దారితీయవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును సంస్థ 7 శాతం నుంచి ఇప్పటికే 6.9 శాతానికి తగ్గించింది.
⇔ భారత ప్రభుత్వ సంస్కరణలు దీర్ఘకాలికంగా వ్యవస్థాగత ప్రయోజనాలను అందించేవే. అయితే స్వల్పకాలికంగా నిర్వహణ, సర్దుబాట్ల ఇబ్బందులు ఉంటాయి.
⇔ 2017 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వినియోగం పడిపోతుందని మేము భావిస్తున్నాం. అయితే 2018 ఆర్థిక సంవత్సరంలో తిరిగి వృద్ధి ఊపందుకునే వీలుంది. దీర్ఘకాలికంగా చూస్తే...వృద్ధి తిరిగి 8 శాతం జోన్‌లోకి ప్రవేశించే అవకాశమూ ఉంది.
నోట్ల రద్దు సమస్య స్వల్పకాలమే: నొమురా
భారత్‌లో నోట్ల రద్దు ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొమురా అంచనా వేసింది. దీర్ఢకాలంలో భారత్ వృద్ధి తీరుకు భరోసాను ఇచ్చింది. వచ్చే 12 నెలల కాలం చూస్తే... వృద్ధి విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదని పేర్కొంది. 2016, 17లో వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంటుందని, 2018లో ఇది 7.7 శాతానికి చేరుతుందని వివరించింది.