అకౌంట్ లేకపోయినా నగదు బదిలీ
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ స్కీమ్‌ను బుధవారం ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో అవతలి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా సొమ్ములను పంపించవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం..
ఐసీఐసీఐ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా ఉన్న వ్యక్తి ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఇతర వ్యక్తులకు డబ్బులు పంపించవచ్చు.
డబ్బులు స్వీకరించే వ్యక్తికి ఏ బ్యాంక్‌లోనూ ఖాతా ఉండవలసిన అవసరం లేదు. మొబైల్ నంబర్, అడ్రస్ ఉంటే చాలు. డబ్బులు స్వీకరించే వ్యక్తి మొబైల్ నంబర్‌కు ఆరు అంకెల రహస్య కోడ్‌ను పంపిస్తారు. ఈ నంబర్‌తో సదరు వ్యక్తి ఏ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం నుంచైనా డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. డబ్బులు పంపించిన రెండు రోజుల్లోగా వాటిని విత్‌డ్రా చేసుకోవలసి ఉంటుంది.
ఎలక్ట్రానిక్ చెల్లింపులు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇలాంటి వినూత్నమైన సర్వీస్‌ను అందిస్తున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సభర్వాల్ పేర్కొన్నారు. ఈ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ కారణంగా తమ ఖాతాదారుల కుటుంబ సభ్యులు, మిత్రులు సులభంగా డబ్బులను పొందవచ్చని వివరించారు.